TVK Vijay : తెల్ల చొక్కా.. ఖాకీ ప్యాంట్.. తమిళనాడును ఊపేసిన జెన్ జీ!

తమిళనాడు అంటేనే ద్రవిడ సిద్ధాంతాల పురిటిగడ్డ. 1967 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయం అంతా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరిగింది. కానీ, 2026 ఎన్నికల ఫలితాలు ఈ 70 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టాయి.

New Update
vijay (1)

తమిళనాడు అంటేనే ద్రవిడ సిద్ధాంతాల పురిటిగడ్డ. 1967 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయం అంతా డీఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరిగింది. కానీ, 2026 ఎన్నికల ఫలితాలు ఈ 70 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టాయి. అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్‌లలో యువత ఎలాగైతే వ్యవస్థలను మార్చేశారో.. ఇప్పుడు తమిళనాడులోనూ 18 నుంచి 35 ఏళ్ల యువత విజయ్ను తమ నవ నాయకుడిగా ఎంచుకున్నారు.

గతంలో ఎంజీఆర్ అయినా, జయలలిత అయినా ద్రవిడ సిద్ధాంతాల పునాదులపైనే రాజకీయాలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా ఇక్కడ నిలబడలేక పొత్తులకే పరిమితమయ్యాయి. కానీ, విజయ్ ఇప్పుడు ఆ పాత ద్రవిడ మూసను బద్దలు కొట్టారు. ద్రవిడ సిద్ధాంతంతో సంబంధం లేకుండా, తనదైన శైలిలో నవ ద్రవిడ రాజకీయాన్ని యువతకు చేరువ చేశారు. ఆయన మతపరమైన గుర్తింపు కంటే, ఆయన ఇచ్చే భరోసానే యువతను ఎక్కువగా ఆకర్షించింది.

చెన్నై పరిధిలోని 16 నియోజకవర్గాల్లోనూ టీవీకే ఆధిక్యంలో ఉండటం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, చిన్న వ్యాపారులు, ముఖ్యంగా కొత్త తరం ఓటర్లు విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపారు. జెన్ జీ ఓటర్లు కేవలం తాము ఓటు వేయడమే కాకుండా, ఇంట్లోని తమ తల్లిదండ్రులను, తాతముత్తాతలను కూడా ప్రభావితం చేయడంలో సక్సెస్ అయ్యారు. అందుకే ఏ సర్వే సంస్థకు కూడా ఓటరు నాడి చిక్కలేదు.

ఎన్నికల రోజే విజయ్ విజయం

ఎన్నికల రోజే విజయ్ విజయం ఖాయమని అర్థమైపోయింది. పోలింగ్ కేంద్రాల వద్ద యువత అంతా తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంట్  ధరించి సందడి చేశారు. చేతిలో పార్టీ గుర్తు అయిన ఈలను పట్టుకుని హల్ చల్ చేస్తూ, సెల్ఫీలతో సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇది ఒక రాజకీయ పోరాటంలా కాకుండా, ఒక పండుగలా సాగడం విజయ్ క్రేజ్‌కు నిదర్శనం.  1967 తర్వాత తమిళనాడులో 6 సార్లు డీఎంకే, 7 సార్లు ఏఐఏడీఎంకే అధికారాన్ని పంచుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు