/rtv/media/media_files/2026/04/11/husband-2026-04-11-07-36-42.jpg)
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఒక వ్యాపారి హత్యోదంతం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఘటనలో, భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఏప్రిల్ 7వ తేదీ రాత్రి, 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ తన ఇంట్లోనే విగతజీవిగా పడి ఉన్నాడు. పదునైన ఆయుధంతో అతనిపై దాడి జరిగినట్లు మృతదేహంపై ఉన్న గాయాలు స్పష్టం చేశాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అతని భార్య ప్రియాంక పురోహిత్ పోలీసులకు ఒక కథ చెప్పింది. గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి, సుమారు 3.5 లక్షల విలువైన సొత్తు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని ఏడుస్తూ నాటకమాడింది. తనను కూడా బంధించి బందీగా ఉంచారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.
విచారణ చేపట్టగా అసలు నిజం
అయితే, పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. దేవకృష్ణ సోదరి జ్యోతి చెప్పిన విషయాలు పోలీసుల అనుమానాన్ని బలపరిచాయి. ప్రియాంక తన భర్తను రంగు పేరుతో తరచూ అవమానించేదని ఆమె తెలిపింది. "నువ్వు నల్లగా ఉన్నావు.. నన్ను పొందే అర్హత నీకు లేదు.. నా రేంజ్ వేరు" అంటూ దేవకృష్ణను ప్రియాంక నిరంతరం వేధించేదని జ్యోతి ఆరోపించింది. అంతేకాకుండా, 2020 నుంచే ప్రియాంకకు కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో సంబంధం ఉందని, ఈ క్రమంలోనే భర్తను అడ్డుతొలగించుకోవాలని ఆమె పథకం వేసిందని పోలీసులు నిర్ధారించారు.
ఈ హత్య కోసం ప్రియుడు కమలేష్, సురేంద్ర భాటి అనే వ్యక్తితో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా 50 వేల రూపాయలు కూడా చెల్లించాడు. ప్లాన్ ప్రకారం, హత్య జరిగిన రాత్రి ప్రియాంక కావాలనే తలుపులు తీసి ఉంచింది. దేవకృష్ణ నిద్రపోతున్న సమయంలో సురేంద్ర లోపలికి ప్రవేశించి దాడి చేశాడు. అనంతరం అది దొంగతనంలా కనిపించడం కోసం గదిని చిందరవందర చేసి, నగలు మాయం చేశారు. కానీ, పోలీసులు సోదాలు చేయగా మాయమైనట్లు చెప్పిన నగలు ఇంట్లోనే దొరకడం, మొబైల్ డేటా ఆధారాలు లభించడంతో ప్రియాంక దొరికిపోయింది.
పోలీసుల విచారణలో ప్రియాంక తన నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం పోలీసులు ప్రియాంక, కమలేష్‌లను అరెస్ట్ చేయగా, సుపారీ తీసుకున్న సురేంద్ర కోసం గాలిస్తున్నారు. "నా కొడుకును చంపిన వారికి ఉరిశిక్ష పడాలి" అని దేవకృష్ణ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. పెళ్లి చేసుకున్న భర్తను రంగు పేరుతో హీనంగా చూడటమే కాకుండా, పక్కా ప్లాన్‌తో ప్రాణాలు తీయడం అందరినీ కలిచివేస్తోంది.
Follow Us