Mamata Banerjee : వెళ్లేవాళ్లు వెళ్లొచ్చు.. అవసరమైతే నేనే పార్టీ ఆఫీసులకు రంగులేస్తా! :  దీదీ సంచలన కామెంట్స్!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం ఎదురై, అధికారాన్ని కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు.

New Update
mamata

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం ఎదురై, అధికారాన్ని కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు.  తన నివాసంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓటమితో కుంగిపోకుండా పార్టీని మళ్లీ మొదటి నుండి నిర్మించాలని ఆమె క్యాడర్‌కు పిలుపునిచ్చారు.

ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ నేతలు వేరే పార్టీల్లోకి మారుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. "వేరే పార్టీల్లోకి వెళ్లాలనుకునే వాళ్లు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.. వారిని నేను బలవంతంగా ఆపను. నేను మళ్లీ మొదటి నుండి పార్టీని నిర్మిస్తా. పార్టీలోనే ఉంటున్న వారికి నేను ఒకటే చెప్తున్నా.. దాడుల్లో దెబ్బతిన్న మన పార్టీ ఆఫీసులను మళ్లీ తెరవండి, వాటికి రంగులు వేయండి. అవసరమైతే నేనే స్వయంగా వచ్చి రంగులు వేస్తా! తృణమూల్ కాంగ్రెస్ ఎవరి ముందూ తలవంచదు. ఇది ప్రజల తీర్పు కాదు.. ప్రజా తీర్పును లూటీ చేశారు." అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

టీఎంసీకి ఊహించని షాక్

ఈ ఎన్నికల్లో టీఎంసీకి ఊహించని షాక్ తగిలింది. నిన్నటివరకు అధికార పీఠంపై ఉన్న ఆ పార్టీ.. ఈసారి కేవలం ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ టీఎంసీ కేవలం 80 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మమతా బెనర్జీ తన సొంత కోట అయిన భవానీపూర్ నియోజకవర్గం నుంచే స్వయంగా ఓడిపోవడం పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. టీఎంసీ తరఫున పోటీ చేసిన 211 మంది అభ్యర్థులు ఓటమి పాలుకాగా.. అందులో పలువురు సీనియర్ హెవీవెయిట్ నేతలు, మంత్రులు కూడా ఉన్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన  మరుసటి రోజే కొందరు నేతలు పార్టీ మారుతారని తనకు తెలుసని మమత హింట్ ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో క్యాడర్‌లో అసంతృప్తి పెరగకుండా, వలసలను అడ్డుకోవడంతో పాటు ఓడిపోయిన అభ్యర్థుల్లో ధైర్యం నింపడానికే దీదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరోవైపు టీఎంసీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. "అధికార పక్షం చేసిన అరాచకాలు, బెదిరింపులను తట్టుకుని మన అభ్యర్థులు వీరోచితంగా పోరాడారు. ప్రజల తీర్పును దొంగిలించిన వారి ముందు తలవంచే ప్రసక్తే లేదు. టీఎంసీ అంతా ఒకే కుటుంబం.. చివరకు సత్యమే గెలుస్తుంది" అని పోస్ట్ చేసింది. ఓటమి తెచ్చిన కష్టకాలంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు మమతా బెనర్జీ వేస్తున్న ఈ అడుగులు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.

Advertisment
తాజా కథనాలు