Mamata Banerjee : మమతా బెనర్జీకి దిమ్మతిరిగే షాక్.. MLA లంతా ధర్నాకు డుమ్మా!

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ తన పాత స్ట్రీట్ ఫైటర్ అవతారంలోకి వచ్చారు. ఎన్నికల అనంతరం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కోల్‌కతా నడిబొడ్డున ఆమె భారీ ధర్నాకు దిగారు.

New Update
mamata

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మళ్లీ తన పాత స్ట్రీట్ ఫైటర్ అవతారంలోకి వచ్చారు. ఎన్నికల అనంతరం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కోల్‌కతా నడిబొడ్డున ఆమె భారీ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒకవైపు మమతా బెనర్జీ అంతలా గర్జిస్తున్నా.. పార్టీలో ఆమె పట్టు సడలుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 5 గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఈ ధర్నాకు హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శోభన్‌దేబ్ చటోపాధ్యాయ, నాన్యా బందోపాధ్యాయ, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్ర అనే ఎమ్మెల్యేలతో పాటు.. డోలా సేన్, కల్యాణ్ బెనర్జీ, డెరెక్ ఒబ్రెయిన్ అనే ఎంపీలు మాత్రమే ఆమె పక్కన కనిపించారు. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ నేతలను ఒకతాటిపైకి తీసుకురావడంలో మమత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, పార్టీ త్వరలోనే చీలిపోయే అవకాశం ఉందనే చర్చకు ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.

అంతర్గత విభేదాలు

టీఎంసీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఒకరోజు ముందే మమతా బెనర్జీ తన నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది హాజరుకాలేదు. అలాగే పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు రితాబ్రతా బెనర్జీ, సందీపన్ సాహా కోల్‌కతాలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో పలువురు టీఎంసీ శాసనసభ్యులతో సీక్రెట్‌గా భేటీ అవ్వడం కలకలం రేపింది. మరోవైపు, శోభన్‌దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలంటూ పంపిన లేఖలో పలువురు టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు ఎంపీలు కూడా పార్టీ కీలక పదవులకు రాజీనామా చేశారు.

ఎన్నికల తర్వాత తన మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన రాళ్ల దాడిని, హుగ్లీలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై జరిగిన దాడిని మమత ప్రస్తావించారు. "ఆ రోజు రాయి గనుక అభిషేక్ తలకు తగిలి ఉంటే అతను చనిపోయేవాడు. ఎన్నికల్లో ఓట్లు లూటీ చేయడమే కాకుండా.. ఇప్పుడు మా ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను పోలీసులతో బెదిరిస్తున్నారు. టీఎంసీ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది" అని ఆరోపించారు. రాష్ట్రంలో సువేందు అధికారి ప్రభుత్వం తమ రాజకీయ కార్యకలాపాలకు అడ్డుపడుతోందని, కనీసం స్టేజ్ కట్టుకోవడానికి, మైక్ పెట్టుకోవడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని.. అందుకే మెగాఫోన్ పట్టుకుని మాట్లాడాల్సి వస్తోందని మమత ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసన అంత తేలిగ్గా ఆగదని, ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు