/rtv/media/media_files/2026/05/08/suvendhu-adhikari-2026-05-08-13-35-13.jpg)
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ హవాకు బ్రేక్ వేసి, రాష్ట్రంలో తొలిసారి కమల వికాసానికి కారణమైన నేత సువేందు అధికారి. నాడు మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ఎలాగైతే వ్యూహాలు రచించారో.. నేడు ఆమెను గద్దె దించడానికి అంతకంటే బలమైన వ్యూహాలతో సక్సెస్ అయ్యారు.
సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్‌లోని పూర్వ మేదినీపూర్ జిల్లా, కర్కూలి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి గాయత్రీ అధికారి, తండ్రి సిసిర్ అధికారి. రవీంద్రభారతి యూనివర్సిటీ నుండి ఆయన తన ఉన్నత విద్యను పూర్తి చేశారు. సువేందు అధికారి పెళ్లి చేసుకోలేదు. బెంగాల్‌లోనే ఆయనది అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబం. వీరికి పూర్వ మేదినీపూర్ జిల్లాలో గట్టి పట్టు ఉంది.
ఈయన తండ్రి తండ్రి సిసిర్ అధికారి బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నేత. మన్మోహన్ సింగ్ యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కుటుంబమంతా మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టీఎంసీలో కీలక పాత్రలు పోషించి, ప్రస్తుతం బీజేపీ గూటికి చేరారు. సువేందు అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని 1995లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. కంఠి మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఆయన రాజకీయాల్లో తొలి అడుగు వేశారు. మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్థాపించినప్పుడు సువేంధు కూడా తన తండ్రితో కలిసి అందులో చేరారు.
లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) కోసం నందిగ్రామ్‌లో రైతుల భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీ ఉద్యమానికి సువేందు అధికారి సారథ్యం వహించారు. ఈ నందిగ్రామ్ ఉద్యమమే 2011లో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. 2006లో ఎమ్మెల్యేగా, 2009 & 2014లో తమ్లుక్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. 2016లో నందిగ్రామ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మమతా బెనర్జీ క్యాబినెట్‌లో రవాణా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
టీఎంసీలో నంబర్-2 స్థానంలో ఉన్న సువేందు అధికారికి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్టీలో వేగంగా ఎదుగుతుండటం నచ్చలేదు. వారసత్వ రాజకీయాలకు నిరసనగా, తనను సైడ్‌లైన్ చేస్తున్నారన్న అసంతృప్తితో ఆయన 2020 డిసెంబర్‌లో మంత్రి పదవులకు, టీఎంసీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
మమతను ఓడించి సంచలనం
2021లో తన గురువు మమతా బెనర్జీపై నందిగ్రామ్ నియోజకవర్గంలో నేరుగా పోటీకి దిగి.. 1,956 ఓట్ల స్వల్ప తేడాతో ఆమెను ఓడించి సంచలనం సృష్టించారు సువేందు అధికారి. అనంతరం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2026 ఎన్నికలలో సువేందు అధికారి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటం చేశారు. అటు తన సొంత కోట అయిన నందిగ్రామ్ స్థానంతో పాటు, ఇటు మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ స్థానంలో కూడా పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఘనవిజయం సాధించి, భవానీపూర్‌లో మమతను ఏకంగా 15,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించి బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని జెయింట్ కిల్లర్ గా అవతరించారు.
Follow Us