Kajal Meena : మొదటి పోస్టింగ్‌లోనే ఏసీబీకి చిక్కిన గోల్డ్ మెడలిస్ట్: లంచం కేసులో అరెస్ట్ !

రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ టాపర్‌గా నిలిచిన యువ అధికారిణి కాజల్ మీనా అవినీతి ఉచ్చులో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరౌలీ జిల్లాలోని నాడోటి పట్టణంలో ఈ అరెస్టులు జరిగాయి.

New Update
kajal meenu

రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ టాపర్‌గా నిలిచిన యువ అధికారిణి కాజల్ మీనా అవినీతి ఉచ్చులో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఎస్‌డిఎం కాజల్ మీనా, ఆమె సిబ్బందిలోని మరో ఇద్దరు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కరౌలీ జిల్లాలోని నాడోటి పట్టణంలో ఈ అరెస్టులు జరిగాయి.

ఏసీబీ డైరెక్టర్ జనరల్ గోవింద్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఒక భూ వివాదంలో తుది డిక్రీ జారీ చేసేందుకు ఎస్‌డిఎం కాజల్ మీనా, ఆమె రీడర్ దినేష్ కుమార్ సైనీ, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ ధాకడ్ కలిసి తొలుత రూ. లక్ష డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 50,000 కు తగ్గించారు. బాధితుడి ఫిర్యాదును సవాయి మాధోపూర్ ఏసీబీ బృందం నిశితంగా పరిశీలించి ఈ దాడిని చేపట్టింది.

పక్కా ప్లాన్‌తో రంగంలోకి 

పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. నిందితులు రూ. 60,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇందులో రూ. 50,000 ఎస్‌డిఎంకు, రూ. 10,000 రీడర్‌కు చేరాల్సి ఉంది. అంతేకాకుండా, అక్కడున్న ఒక బ్యాగులో అదనంగా రూ. 4 లక్షల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కాజల్ మీనా 2024 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి. ఎస్టీ కేటగిరీలో టాపర్‌గా నిలిచిన ఆమె, ఐఐటి మండి నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తి చేశారు. అత్యంత ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకున్న ఆమెకు ఇది తొలి పోస్టింగ్ కావడం గమనార్హం.

ఈ అరెస్టు వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు టాపర్‌గా మెరిసిన అధికారిణి ఇలా అవినీతికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సర్వెంట్లు వ్యవస్థకు పరాన్నజీవులుగా మారుతున్నారు అని కొందరు విమర్శించగా, అన్నింటిలోనూ ర్యాంక్ వన్ సాధించిన ఆమె, చివరకు లంచం తీసుకుంటూ పట్టుబడటంలో కూడా రికార్డు సృష్టించింది అంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు