Mamata Benarjee : సీఎంగా మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? రాజ్యంగంలో ఏముందో తెలుసా?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

New Update
Mamata benarjee

Mamata benarjee

 Mamata Benarjee :  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఎలా ఉండబోతోంది? రాజ్యాంగపరమైన నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే అంశాలపై ప్రత్యేక కథనం  

15 ఏళ్ల తర్వాత ఎదురైన ఈ ఓటమిని మమతా బెనర్జీ అంగీకరించడం లేదు. బీజేపీ సుమారు 100 స్థానాలను దొంగిలించిందని, తాను బీజేపీతో కాకుండా ఎన్నికల కమిషన్‌తో పోరాడానని ఆమె ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తనపై దాడులు జరిగాయని పేర్కొంటూ, "నేను ఓడిపోలేదు, కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదు" అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ముఖ్యమంత్రులు తమ రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కానీ మమతా మొండివైఖరి ఇప్పుడు ప్రతిష్టంభనకు దారితీస్తోంది.

గవర్నర్ విశేష అధికారాలు:

ఒకవేళ ఓడిపోయిన ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే, గవర్నర్‌కు రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలను కల్పించింది. ఆర్టికల్ 164 ప్రకారం రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిని నియమించి, ప్రమాణ స్వీకారం చేయించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. మొదటగా గవర్నర్ ఓడిపోయిన సీఎంతో రాజీనామా చేయమని కోరవచ్చు. ఒకవేళ నిరాకరిస్తే, ఆయన తక్షణమే ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి, అసెంబ్లీని రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావిస్తే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనకు కూడా సిఫార్సు చేయవచ్చు.

నూతన ప్రభుత్వ ఏర్పాటు ఎలా?

ప్రజాతీర్పు స్పష్టంగా వచ్చినందున, ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీకి (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ ఆహ్వానం పలుకుతారు. ఆ పార్టీ ఎన్నుకున్న శాసనసభాపక్ష నేతను ముఖ్యమంత్రిగా నియమిస్తారు. మమతా బెనర్జీ రాజీనామా చేసినా చేయకపోయినా, మెజారిటీ సాధించిన పక్షం గవర్నర్ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. కాబట్టి ఆమె మొండితనం కొత్త ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోలేదు.

మే 7తో ముగియనున్న గడువు

పశ్చిమ బెంగాల్ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 7వ తేదీతో ముగియనుంది. అంటే మే 8వ తేదీ నుంచి పాత అసెంబ్లీ దానంతట అదే రద్దవుతుంది. ఈ లోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాత మమతా బెనర్జీ సీఎం పదవిలో కొనసాగడం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం. కాబట్టి మే 8 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాక తప్పని పరిస్థితి నెలకొంటుంది. మమతా బెనర్జీ తన పోరాటాన్ని కోర్టుల ద్వారా లేదా ప్రజాక్షేత్రంలో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఆగదు. గవర్నర్ ఇప్పటికే బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలందరూ సమావేశమై తమ నేతను ఎన్నుకున్న వెంటనే, గవర్నర్ ఆ నేతతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీంతో మమతా బెనర్జీ శకం ముగిసి, బెంగాల్‌లో సరికొత్త పాలన మొదలవుతుంది.

Advertisment
తాజా కథనాలు