Anna Hazare : కేజ్రీవాల్ క్లీన్ చిట్.. అన్నా హజారే రియాక్షన్ ఇదే!

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు.

New Update
Anna Hazare

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని, మన దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమైనదని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేజ్రీవాల్ నిర్దోషిగా బయటకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

గతంలో కేజ్రీవాల్‌పై తాను చేసిన విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. అప్పట్లో ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు న్యాయస్థానం పూర్తి విచారణ జరిపి ఆయనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు అన్నా హజారే ఒక కీలక సూచన చేశారు. 

ఇకనైనా తన గురించి లేదా తన పార్టీ గురించి మాత్రమే ఆలోచించడం మానేసి, సమాజం కోసం, దేశం కోసం కష్టపడాలని హితవు పలికారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఒకప్పుడు తన వద్ద కార్యకర్తలుగా పనిచేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయ ఆశయాల వల్ల 2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం దెబ్బతిన్నదని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన హజారే, ఇప్పుడు కోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

 కేజ్రీవాల్ సవాల్

అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. మోదీ నిజంగా నిజాయితీ పరుడే అయితే ఢిల్లీలో మళ్లీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా కేజ్రీవాల్ మోడీని సవాలు చేశారు. మళ్లీ ఎన్నికలు పెడితే అందులో బీజేపీ10 స్థానాలకు పైగా గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. ఈ రోజు కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు. తమపై ప్రధాని మోదీ, అమిత్‌షా కుట్ర చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. తమకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారాయన.  

Advertisment
తాజా కథనాలు