/rtv/media/media_files/2026/03/25/jaishankar-2026-03-25-20-40-41.jpg)
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వపక్ష సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం కోసం పాకిస్థాన్ పడుతున్న పాట్లపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.
బుధవారం పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పశ్చిమ ఆసియా సంక్షోభంపై సర్వపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్. జైశంకర్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన ఒక అంశానికి జైశంకర్ ఇచ్చిన సమాధానం సంచలనం రేపింది.
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, పాకిస్థాన్ ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇస్లామాబాద్‌లో చర్చలు జరపడానికి తాము సిద్ధమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికా పంపిన ఒక ప్రతిపాదనను కూడా పాక్ ఇప్పటికే ఇరాన్‌కు చేరవేసింది. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ.. "పాకిస్థాన్ అంత చొరవ తీసుకుంటుంటే భారత్ ఎందుకు మౌనంగా ఉంది?" అని ప్రశ్నించాయి.
జైశంకర్ ఘాటు సమాధానం:
దీనికి స్పందించిన జైశంకర్.. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక గౌరవాన్ని కలిగి ఉందని స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ ఒక దళారీ దేశం లాగా వ్యవహరించదు. మన విదేశీ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం పేరుతో క్రెడిట్ కొట్టేయాలని మేము చూడమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్ రియాక్షన్ ఏంటి?
మరోవైపు పాకిస్థాన్ పడుతున్న పాట్లను ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ బాహాటంగానే ప్రకటించింది. అమెరికా చర్యలు దౌత్యానికి వెన్నుపోటు అని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఈ యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. గల్ఫ్ రీజియన్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ క్రమంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తూ, శాంతిని కాపాడాలని కోరుతోంది తప్ప, పాకిస్థాన్ లాగా అనవసరపు మధ్యవర్తిత్వాలకు సిద్ధంగా లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
Follow Us