/rtv/media/media_files/2026/05/13/government-cancels-appointment-of-osd-ricky-ratham-pandit-vetrivel-2026-05-13-13-30-25.jpg)
Government cancels appointment of OSD Ricky Ratham Pandit Vetrivel
Thalapathy Vijay :తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సరికొత్త సంచలనాలకు తెరలేపిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్, తాజాగా మరో కీలకమైన,వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారి (OSD)గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్ర విమర్శల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సొంత కూటమిలోని మిత్రపక్షాలతో పాటు, ప్రతిపక్షాల నుండి తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవడంతో సీఎం విజయ్ వెనక్కి తగ్గక తప్పలేదు.
అసలు ఎవరీ రాధన్ పండిట్ వెట్రివెల్?
తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో రాధన్ పండిట్ వెట్రివెల్ (రాధా పండిట్) ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందారు. ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నేత జాతకం ఎలా ఉందనే విషయాలపై ఆయన జ్యోతిష్యం చెబుతుంటారు. నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి, 'టీవీకే' పార్టీ స్థాపన వరకు ఆయన జాతకంపై రాధన్ పండిట్ సంచలన అంచనాలు వేశారు. విజయ్ జాతకంలో బలమైన 'రాజయోగం' ఉందని, ఆయన జాతకం ఒక సునామీ లాంటిదని, తమిళనాడు రాజకీయాల్లో ఆయన రాకతో ఊహించని మార్పులు వచ్చి ముఖ్యమంత్రి అవుతారని ఏడాది కాలంగా బల్లగుద్ది మరీ చెబుతూ వచ్చారు.
ఆయన అంచనా వేసినట్లుగానే ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే కూటమి విజయం సాధించి విజయ్ సీఎం అయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాధన్ పండిట్ నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరపడమే కాకుండా, సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. విజయ్‌తో ఉన్న ఈ వ్యక్తిగత అనుబంధం, నమ్మకం కారణంగానే ఎవరూ ఊహించని విధంగా ఒక జ్యోతిష్యుడిని సీఎం కార్యాలయంలో ఓఎస్‌డీ (రాజకీయ విభాగ కార్యదర్శి) వంటి అత్యున్నత ప్రభుత్వ పదవిలో నియమించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
'లౌకిక ప్రభుత్వంలో అశాస్త్రీయత వద్దు'
తాము ఒక లౌకిక (సెక్యులర్) ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించిన విజయ్, తన సొంత జాతకం చెప్పిన జ్యోతిష్యుడికి కీలక పదవి కట్టబెట్టడంపై ఇటు నెటిజన్లు, అటు మిత్రపక్షాలు మండిపడ్డాయి. టీవీకే ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ సోషల్ మీడియా (X) వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఒక జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రికి రాజకీయ సలహాదారుడిగా, ఓఎస్‌డీగా నియమించుకోవడం ఏంటి? ఇది నాకేమీ అర్థం కావడం లేదు, ఎవరైనా వివరించగలరా?" అంటూ విజయ్ వైఖరిని తప్పుపట్టారు.
విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) వీసీకే ప్రధాన కార్యదర్శి డి. రవికుమార్ స్పందిస్తూ.. లౌకిక ప్రభుత్వంలో ఇలాంటి నియామకాలు ఆమోదయోగ్యం కాదని, సీఎం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి. షణ్ముగం ఘాటుగా స్పందిస్తూ.. "ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రభుత్వ కనీస కర్తవ్యం. రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ అశాస్త్రీయ నియామకాన్ని తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఒక జ్యోతిష్యుడు ప్రభుత్వానికి రాజకీయ సలహాలు ఇవ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ వివాదం బుధవారం నాటి అసెంబ్లీ బలపరీక్షా సమయంలో మరింత ముదిరింది. డీఎండీకే (DMDK) పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రేమలతా విజయ్‌కాంత్ (దివంగత నటుడు విజయ్‌కాంత్ సతీమణి) అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్‌పై కడిగిపారేసేలా వ్యాఖ్యలు చేశారు. సభలో ఆమె మాట్లాడుతూ.. "మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టాలనే మీ నిర్ణయం మంచిదే. కానీ, రాష్ట్రంలోని యువత మిమ్మల్ని, మీ సిద్ధాంతాలను నమ్మి ఓటు వేసి గెలిపించారు. అలాంటిది మీరు మూఢనమ్మకాలతో జ్యోతిష్యులను నమ్ముతున్నారు. అసలు ఒక జ్యోతిష్యుడిని తెచ్చి ఓఎస్‌డీగా ఎందుకు నియమించుకున్నారు? ఈ నియామకం ద్వారా సమాజానికి, ముఖ్యంగా మిమ్మల్ని నమ్మిన యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వచ్చేవాళ్లు వేరే ముఖం వేసుకుని రావాల్సిన పరిస్థితి తేవద్దు" అంటూ ఘాటుగా చురకలు అంటించారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఆమె ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకే పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు.
వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. నియామకం రద్దు
ఇటు అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసనలు, అటు సొంత కూటమిలోని కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే నేతల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో సీఎం విజయ్ ఆలోచనలో పడ్డారు. పరిపాలన ప్రారంభంలోనే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారనే ముద్ర పడటం ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన గ్రహించారు. మొదట ఈ నియామకంపై పునరాలోచిస్తానని అంతర్గతంగా సంకేతాలు ఇచ్చిన విజయ్, తీవ్రతను గమనించి చివరకు రాధన్ పండిట్ వెట్రివెల్ ఓఎస్‌డీ నియామకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వాలు జ్యోతిష్యానికి కాకుండా శాస్త్ర విజ్ఞానానికి, రాజ్యాంగ బద్ధమైన పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మిత్రపక్షాల సూచనలకు గౌరవం ఇస్తూ సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయంతో కూటమిలో తలెత్తిన చిన్నపాటి వివాదానికి ప్రారంభంలోనే తెరపడినట్లయింది.
Follow Us