/rtv/media/media_files/2026/05/05/tvk-chief-vijay-requested-congress-support-to-form-tamilnadu-govt-2026-05-05-21-52-38.jpg)
TVK Vijay TN CM
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 7న (గురువారం) చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై, ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కార్యాలయానికి ఆయన లేఖ కూడా రాశారు.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, టీవీకేకు 108 స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలత వ్యక్తం చేసింది. 5గురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మద్దతు లభించినా, ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదుగురి మద్దతు అవసరం కానుంది. దీనికోసం ఇతర పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ ఎం.కె.స్టాలిన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆయన్నే ఆ పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరారు.
విజయం అనంతరం విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమ లక్ష్యం ప్రజల శ్రేయస్సేనని స్పష్టం చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ప్రధాని మోదీకి అభినందనలు తెలపడం విశేషం. గవర్నర్ కేరళ పర్యటన ముగించుకుని చెన్నై చేరుకోగానే, విజయ్ బృందం ఆయనను కలిసి అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనుంది.
మద్దతు ఇచ్చేది ఎవరు?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 'మ్యాజిక్ ఫిగర్' కోసం టీవీకే అధినేత విజయ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం టీవీకే బలం 108 స్థానాలు కాగా, విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు స్పీకర్ ఎన్నికను పరిగణనలోకి తీసుకుంటే, 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు మరో 12 మంది ఎమ్మెల్యేల మద్దతు అత్యవసరం. ఈ అదనపు బలాన్ని ఎవరి నుంచి సేకరించాలనే అంశంపై టీవీకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 5 గురు మద్దతు ఇచ్చినా మరో 7గురి మద్దతు అవసరం పడుతుంది.
ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ముందున్న రాజకీయ మార్గాలు ఇవే:
చిన్న పార్టీల కలయికతో ప్రభుత్వం:
విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ (5 సీట్లు) ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. వీరికి తోడు డీఎంకే కూటమిలో ఉన్న ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం, వీసీకే (ఒక్కొక్కరికి 2 సీట్లు), డీఎండీకే (1 సీటు) వంటి పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. అయితే, ఎన్నికల్లో డీఎంకేకు వ్యతిరేకంగా పోరాడిన విజయ్‌కు, ఆ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఎంతవరకు సహకరిస్తాయనేది సవాలుగా మారింది.
అన్నాడీఎంకే కూటమితో పొత్తు:
మరోవైపు, అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే (4 సీట్లు), ఏఎంఎంకే (1 సీటు) మద్దతు పొందినా సంఖ్యాబలం సరిపోదు. ఒకవేళ 47 స్థానాలున్న అన్నాడీఎంకే ప్రత్యక్షంగా మద్దతు ఇస్తే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. విజయ్ గతంలో ఎప్పుడూ అన్నాడీఎంకేను తీవ్రంగా విమర్శించకపోవడం ఈ సమీకరణానికి బలం చేకూరుస్తోంది. అయితే, అన్నాడీఎంకే మద్దతు కోరితే భవిష్యత్తులో రాజకీయంగా ఎదురయ్యే పరిణామాలపై టీవీకే ఆచితూచి అడుగులు వేస్తోంది.
పార్టీలో చీలికలు వచ్చే ఛాన్స్?
అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిసామి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు తెలపాలని పురట్చి అన్నాడీఎంకే నేత పుహళెంది చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం అత్యంత కీలకంగా మారింది.
బీజేపీ,అన్నాడీఎంకే కూటమితో ముందుకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించి, రాష్ట్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, 15 రోజుల్లో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నందున, విజయ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. త్వరలోనే ఈ ప్రతిష్టంభనపై ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Follow Us