Thalapathy Vijay : మరికొన్ని గంటల్లో సీఎం గా "విజయ్‌' ప్రమాణ స్వీకారం..స్టేడియం వద్ద అభిమానుల సందడి

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ. తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది.

New Update
FotoJet - 2026-05-10T081653.388

Vijay takes oath as Tamil Nadu CM

Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ.. తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర రాజకీయ అనిశ్చితికి శనివారం సాయంత్రం తెరపడింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శనివారం రాత్రి విజయ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే (TVK) 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది.మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదటగా 5 స్థానాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు ప్రకటించగా, ఆ తర్వాత లెఫ్ట్ పార్టీలైన సీపీఐ (2), సీపీఐ(ఎం) (2) కూడా విజయ్ వైపు మొగ్గు చూపాయి. దీంతో బలం 116 (టీవీకే సొంత బలం 107 కాగా, మిత్రపక్షాల బలంతో కలిపి 116) వద్ద నిలిచింది.

 మద్దతు విషయంలో సస్పెన్స్ కొనసాగించిన తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (VCK), ఆ తర్వాత ఐయూఎంఎల్ (IUML) శనివారం సాయంత్రం టీవీకేకు బేషరతు మద్దతు ప్రకటిస్తూ లేఖలు అందజేశాయి. ఈ రెండు పార్టీలకు ఇద్దరేసి (2+2) ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీకే, ఐయూఎంఎల్ నేతలు స్పష్టం చేశారు.దీంతో విజయ్ నేతృత్వంలోని కూటమి బలం 120 (స్వయంగా విజయ్ రెండు స్థానాల నుంచి గెలవడంతో ఒక సీటు ఖాళీ అవుతుంది, కాబట్టి నికర బలం 120) కి చేరి మెజారిటీ మార్కును సులభంగా దాటింది.

ఈ మద్దతు లేఖలతో శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు హక్కును పొందారు.ఆదివారం (మే 10) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత ఈ వేడుకను ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు నిర్వహించాలని భావించినప్పటికీ, జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు ప్రమాణ స్వీకార సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చినట్లు సమాచారం.

 ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్‌తో పాటు టీవీకేకు చెందిన మరో తొమ్మిది మంది సీనియర్ నాయకులు (ఆదవ్ అర్జున, బుస్సీ ఆనంద్, సెంగోట్టయన్ తదితరులు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.గవర్నర్ సూచనల ప్రకారం.. మే 13వ తేదీ లోపు అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ద్రవిడ కూటమిలోనే మిత్రపక్షాలు

విజయ్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ.. తాము డీఎంకే నేతృత్వంలోని పాత కూటమిలోనే కొనసాగుతామని వీసీకే, ఐయూఎంఎల్ స్పష్టం చేశాయి. కేవలం రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోసమే తాము టీవీకేకు మద్దతు ఇచ్చామని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. అటు నిష్క్రమిస్తున్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా స్పందిస్తూ.. డీఎంకే అసెంబ్లీలో 'నిర్మాణాత్మక ప్రతిపక్షం'గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ ద్రవిడ రాజకీయ ప్రస్థానం తర్వాత, ఒక సరికొత్త ముఖాన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి తమిళ ప్రజలు సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ పాలన ఎలా సాగుతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

స్డేడియం వద్ద అభిమానుల సందడి

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో స్టేడియం వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. విజయ్ అభిమానులు వందలాది మంది స్టేడియం కు చేరుకుంటున్నారు. అభిమానులను నియంత్రించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు స్టేడియం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కాగా విజయ్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనకు సంబంధించిన చిత్రాలకు గిరాకీ బాగా పెరిగింది. విజయ్ ఫోటోతో కూడిన కండువాలు, బ్యాడ్జీలు, పోటోలకు డిమాండ్‌ బాగా పెరిగింది.

Advertisment
తాజా కథనాలు