/rtv/media/media_files/2026/05/14/cm-vijay-2026-05-14-13-30-21.jpg)
తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తళపతి విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలపై క్రాక్‌డౌన్ ప్రారంభించింది. సీఎం ఆదేశాల మేరకు గుడులు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం షాపులను రాబోయే రెండు వారాల్లో పూర్తిగా మూసివేయనున్నారు.
ఇందులో ప్రార్థనా స్థలాల దగ్గర ఉన్న 276 షాపులు, విద్యాసంస్థల సమీపంలోని 186 షాపులు, బస్ టెర్మినల్స్ దగ్గరి 255 షాపులు ఉన్నాయి. ఈ నిర్ణయంతో తమిళనాడులోని మొత్తం టాస్మాక్ షాపుల సంఖ్య 4,765 నుండి 4,048కి తగ్గనుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఈ నిర్ణయం సాగింది.
ఇదిలావుంటే రాష్ట్రంలో మద్యపాన వయస్సు 21 సంవత్సరాలుగా ఉంది. దీనిని క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మద్యం కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్ల వయస్సుపై అనుమానం వస్తే గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలి. 21 ఏళ్ల లోపు వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
రాత్రి 8 గంటల వరకే
ప్రస్తుతం తమిళనాడులో మద్యం దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నడుస్తున్నాయి. అయితే ఈ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రాష్ట్రానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం (2025లో రూ.48,344 కోట్లు) భారీగా ఉన్నప్పటికీ, రాబడి కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యమనే కోణంలో సీఎం విజయ్ ఈ చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒంటరిగా 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మేజారిటీ మార్క్ (118) కు కొద్దిగా దూరంలో నిలిచింది. అయితే, ఇటీవల జరిగిన ట్రస్ట్ ఓట్‌లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్, ఏఐఏడీఎంకే లోని ఒక తిరుగుబాటు వర్గం మద్దతుతో 144 ఎమ్మెల్యేల బలంతో విజయ్ ప్రభుత్వం గెలిచింది.
Follow Us