BIG BREAKING: నేడు  విజయ్‌ ప్రభుత్వానికి బలపరీక్ష.. అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో పెరిగిన బలం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. అయితే అన్నాడీఎంకేకు చెందిన 30 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వం అత్యంత సులభంగా గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

New Update
TVK Vijay

TVK Vijay

BIG BREAKING : తమిళనాడు రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. 233 మంది సభ్యులున్న తమిళనాడు శాసనసభలో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా, టీవీకే ప్రభుత్వానికి ప్రస్తుతం సరిపడా బలం ఉండటంతో ఈ బలపరీక్షను సులభంగానే నెగ్గనుంది. వాస్తవానికి టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించగా, రెండు చోట్ల గెలిచిన సీఎం విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 107 కి చేరింది. అయితే, ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిన తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి నేటి ఓటింగ్‌లో పాల్గొనకూడదని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీ బలం తాత్కాలికంగా 106కి తగ్గింది. అయినప్పటికీ, కాంగ్రెస్‌ (5), ఉభయ కమ్యూనిస్టులు (4), వీసీకే (2), ఐయూఎంల్‌ (2), ఏఎంఎంకే (1) పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వ బలం 120 కి చేరింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ప్రభుత్వానికి ముగ్గురు సభ్యులు అదనంగా ఉన్నారు. దీనికి తోడు అన్నాడీఎంకేకు చెందిన 30 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో విజయ్ ప్రభుత్వం అత్యంత సులభంగా గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మా మద్దతు విజయ్‌కే..అన్నాడీఎంకే చీలిక వర్గం  

అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి (ఈపీఎస్‌)పై ఆ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేసి విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ చీలిక వర్గానికి నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం మంగళవారం అసెంబ్లీ స్పీకర్ జీవీడీ ప్రభాకర్‌ను కలిసి, ఎస్‌పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకేను వ్యతిరేకించడానికి పుట్టిన అన్నాడీఎంకేలో, ఈపీఎస్‌ను సీఎం చేయడానికి డీఎంకే మద్దతిస్తాననడం తమను ఆశ్చర్యపరిచిందని, ఈ ప్రతిపాదనను 90 శాతం మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎన్‌డీఏ కూటమి నుంచి పూర్తిగా వైదొలిగిందని, పార్టీని కాపాడుకునేందుకే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మెజారిటీ సభ్యులం నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సీఎం విజయ్ స్వయంగా షణ్ముగం నివాసానికి వెళ్లి, ఆ 30 మంది అసమ్మతి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాగా, విజయ్‌ మంత్రివర్గంలోని 9 మందిలో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. అలాగే రూ.648.85 కోట్ల ఆస్తులతో సీఎం విజయ్ తమిళనాడులోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు.

బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యే దూరం..  

శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి కేవలం ఒకే ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి నేటి అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనరాదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తన నియోజకవర్గానికి చెందిన పోస్టల్ ఓట్లను వేలూరు సమీపంలోని మరో ప్రాంతానికి తరలించడం వల్లే తాను ఒక్క ఓటుతో ఓడిపోయానని, కాబట్టి పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించేలా ఆదేశించాలని కోరుతూ డీఎంకే అభ్యర్థి కేఆర్ పెరియకరుప్పన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి, జస్టిస్ ఎన్. సెంథిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతూ.. కేసు తేలేవరకు సేతుపతి ఓటింగ్‌లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో సేతుపతికి 83,365 ఓట్లు రాగా, పెరియకరుప్పన్‌కు 83,364 ఓట్లు వచ్చాయి.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పాటైన తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రజల మధ్య విభజనలు తెచ్చే సనాతన వ్యవస్థను నిర్మూలించాల్సిందేనని పునరుద్ఘాటించారు. గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఇలాంటి వ్యాఖ్యలే తీవ్ర వివాదానికి దారితీశాయని, పార్టీ ఓటమికి కూడా ఇదొక కారణమని డీఎంకే వర్గాల్లోనే చర్చ నడిచినప్పటికీ ఉదయనిధి మళ్లీ అదే పంథాను కొనసాగించడం గమనార్హం. ఇదే సమయంలో ఆయన సీఎం విజయ్‌కు కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ తల్లి ప్రార్థనకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, గవర్నర్ ప్రసంగ సమయంలోనూ తమిళ తల్లి ప్రార్థన, జాతీయ గీతాలను వరుసగా ఆలపించేలా చూడాలని కోరారు. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి ప్రార్థనను మూడో స్థానానికి నెట్టేయడంపై ఉదయనిధి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు