Aashirvaad Suryavanshi : ఫ్యామిలీ.. ఫ్యామిలీ అంతా క్రికెట్‌ను ఆడేసుకుంటున్నారు...వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత సెంచరీ

భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న సూర్యవంశీ కుటుంబం నుంచి మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. వైభవ్ 10 ఏళ్ల చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ ఒక స్థానిక మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

New Update
FotoJet - 2026-06-13T133534.059

Aashirvaad Suryavanshi

Aashirvaad Suryavanshi : భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న సూర్యవంశీ కుటుంబం నుంచి మరో అద్భుత ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల వయసులోనే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికై, సచిన్ టెండూల్కర్ రికార్డులనే బద్దలు కొట్టిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బాటలోనే.. అతడి 10 ఏళ్ల చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా అడుగులు వేస్తున్నాడు. అన్నలాగే మైదానంలో బౌలర్ ఎవరు అనే తేడా లేకుండా బౌండరీల వర్షం కురిపిస్తూ, తాజాగా ఒక స్థానిక మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ సూర్యవంశీ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 'క్రికెట్ అకాడమీ ఆఫ్‌ తాజ్‌పూర్' జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ జూనియర్ సంచలనం, తనకంటే ఎంతో సీనియర్లయిన బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మొత్తం 87 బంతులను ఎదుర్కొన్న ఆశీర్వాద్ 118.39 స్ట్రైక్‌రేటుతో 103 పరుగులు సాధించాడు. క్లాస్ మరియు మాస్ షాట్లతో అలరించిన ఈ 10 ఏళ్ల బాలుడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం.

ఈ మ్యాచ్‌లో ఆశీర్వాద్‌తో పాటు తోటి బ్యాటర్ శివమ్ రాజ్ కూడా అర్ధశతకంతో రాణించడంతో తాజ్‌పూర్ జట్టు భారీ స్కోరు సాధించింది. సెంచరీ మార్కును అందుకున్న తక్షణమే ఆశీర్వాద్ మైదానంలో తన హెల్మెట్ తీసి బ్యాట్ పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంత చిన్న వయసులోనే ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా, పక్కా ప్రణాళికతో బౌలర్లను ఎదుర్కొన్న విధానం చూసి క్రికెట్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

తమ్ముడి అద్భుతమైన క్లాస్ ఇన్నింగ్స్ చూసి స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఎంతో మురిసిపోయాడు. వెంటనే ఆశీర్వాద్ స్కోర్ కార్డ్‌కు సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంటూ తమ్ముడికి ప్రత్యేక అభినందనలు తెలిపాడు. నెటిజన్లు కూడా ఈ స్కోర్ కార్డ్‌ను చూసి ఆశ్చర్యపోతూ, "టీమిండియాకు మరో ప్రమాదకర హిట్టర్ దొరికాడు", "సూర్యవంశీ బ్రదర్స్ భారత క్రికెట్‌ను ఏలబోతున్నారు" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరోవైపు పెద్ద కుమారుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించి, జాతీయ జట్టుకు ఎంపికైన ఆనందంలో ఉన్న ఆ కుటుంబానికి తమ్ముడి సెంచరీ డబుల్ ధమాకాను తెచ్చింది. సమస్తిపూర్‌లోని వీరి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున వీరి ఇంటికి తరలివచ్చి మిఠాయిలు, లడ్డూలు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. తమ పిల్లల ప్రతిభకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంపై కుటుంబ సభ్యులు ఆనంద డోలికల్లో తేలుతున్నారు.

పిల్లల ఎదుగుదలపై తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనం నుంచి వైభవ్ దేశం కోసం ఆడాలనే తపనతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడని, ఆ కష్టానికి తగిన ఫలం దక్కి దేశానికి ఆడే సౌభాగ్యం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు చిన్న కుమారుడు ఆశీర్వాద్ కూడా అన్న బాటలోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తూ చిన్న వయసులోనే శతకంతో మెరవడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ఇద్దరు సోదరులు భారత క్రికెట్ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తారని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisment
తాజా కథనాలు