/rtv/media/media_files/2026/06/16/uddav-2026-06-16-17-20-44.jpg)
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ టైగర్ పేరుతో జరుగుతున్న ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది. శివసేన పార్టీకి చెందిన ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వైపు వెళ్తారనే ఊహాగానాల మధ్య, ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన ఎంపీలతో జరిపిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి వెళ్లాలనుకునే వారు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్లవచ్చని, వారికి తాను శుభమే కోరుకుంటానని ఉద్ధవ్ అన్నట్లు సమాచారం.
ఎవరినీ బలవంతంగా ఆపలేదు
నాలుగేళ్ల క్రితం పార్టీలో జరిగిన తిరుగుబాటును గుర్తు చేసుకుంటూ.. నాడు పార్టీలో పెద్ద చీలిక వచ్చింది, 40 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటానని అనుకుంటున్నారా? కానీ నేను ఎవరినీ బలవంతంగా ఆపలేదు అని ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలతో అన్నట్లు తెలుస్తోంది. బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేనను వదిలి వెళ్లిన వాళ్లు భవిష్యత్తులో ఖచ్చితంగా బాధపడతారని, కానీ అప్పటికే కాలం మించిపోతుందని ఆయన హెచ్చరించారు. ఈరోజు నా సమయం కాకపోవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా నాదే అవుతుంది. అంతవరకు మనం ఓపికతో పోరాడాలని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
అయితే, ఉద్ధవ్ ఠాక్రే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే వార్తలను ఆ పార్టీ కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఢిల్లీలో తీవ్రంగా ఖండించారు. తాను ఆ సమావేశం అంతా ఉన్నానని, ఉద్ధవ్ ఠాక్రే అసలు అలాంటి మాటలే అనలేదని చెప్పారు. వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లిపోండని ఉద్ధవ్ గారు ఎప్పుడూ అనరు, అనబోరు అని స్పష్టం చేశారు. శరద్ పవార్ తర్వాత మహారాష్ట్రలో ప్రజలను, కార్యకర్తలను ఎక్కువగా కలిసే నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే మాత్రమేనని, మాతోశ్రీ తలుపులు ఎప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని రౌత్ అన్నారు. తమ పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు ఐక్యంగానే ఉన్నారని, కేవలం ప్రజా పనుల కోసం వేరే పార్టీల మంత్రులను కలిస్తే దానికి రాజకీయ రంగు పూయడం సరికాదని ఆయన హితవు పలికారు.
మరోవైపు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం మాత్రం ఉద్ధవ్ క్యాంప్‌పై ఒత్తిడి పెంచుతోంది. శివసేన మంత్రి ప్రతాప్ సర్నాయక్ మాట్లాడుతూ.. ఆపరేషన్ టైగర్ అనేది ఏడాది పొడవునా, 24 గంటలూ నడిచే ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. వేరే పార్టీల్లో న్యాయం జరగని కార్యకర్తలు, నేతలు బాలాసాహెబ్ సిద్ధాంతాలపై నమ్మకంతో ఏక్‌నాథ్ షిండే వైపు వస్తున్నారని, తమ దృష్టిలో వాళ్లంతా పులులేనని ఆయన అన్నారు.
Follow Us