Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్....తనిఖీల్లో సంచలన వస్తువులు

శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరులు శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్ అనే వ్యక్తి తన సామానులో నిషేధిత 'గార్మిన్ శాటిలైట్ ఫోన్' కలిగి ఉన్నట్లు భద్రతా తనిఖీల్లో వెల్లడైంది.

New Update
Srinagar airport

Srinagar airport

Jammu Kashmir: శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరులు శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్ అనే వ్యక్తి తన సామానులో నిషేధిత 'గార్మిన్ శాటిలైట్ ఫోన్' కలిగి ఉన్నట్లు భద్రతా తనిఖీల్లో వెల్లడైంది. విమానాశ్రయంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా వీరి వద్ద జీపీఎస్ ,శాటిలైట్ పరికరాలను అధికారులు గుర్తించారు. ఈ పరికరాలకు సంబంధించి అధికారులు అడిగిన ప్రశ్నలకు వారు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో, వారిని అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.

జెఫ్రీ స్కాట్ అమెరికాలోని మోంటానా అనే పర్వత ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో, పర్వతారోహణ లేదా ట్రాకింగ్ అవసరాల కోసం దీనిని తెచ్చి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, అత్యంత సున్నితమైన ప్రాంతమైన కాశ్మీర్‌లో ఇద్దరు విదేశీయులు శాటిలైట్ ఫోన్ కలిగి ఉండటాన్ని భద్రతా బలగాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అసలు వీరు ఏ పని మీద శ్రీనగర్ వచ్చారు? నిబంధనల ప్రకారం కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

భారతదేశంలో ఇరిడియం వంటి శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కఠినమైన నిషేధం అమల్లో ఉంది. ఒకవేళ ఎవరైనా విదేశీయులు ఇటువంటి పరికరాలను తీసుకువస్తే, ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ విభాగంలో ముందుగానే సమాచారం అందించాలి. దీనితో పాటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి ప్రత్యేక లైసెన్స్ కూడా పొందాల్సి ఉంటుంది. సరైన అనుమతులు లేకుండా ఇలాంటి పరికరాలను కలిగి ఉండటం టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధనలు తెలియక గతంలోనూ పలువురు విదేశీయులు భారత్‌కు శాటిలైట్ ఫోన్లతో వచ్చి భద్రతా బలగాలకు చిక్కారు.

ప్రస్తుతం అదుపులో ఉన్న ఇద్దరు అమెరికన్ పౌరులను పోలీసులు విచారిస్తున్నారు. జెఫ్రీ స్కాట్ వద్ద దొరికిన పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, ఈ ఘటన వెనుక ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశీ పర్యాటకులు భారత్ పర్యటనకు వచ్చేటప్పుడు స్థానిక చట్టాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు