TVK Vijay : టీవీకే విజయ్‌ షాక్‌... ఉప ఎన్నిక, రాజ్యసభ ఎన్నికల్లో త్రిషకు నో ఛాన్స్‌...

తమిళనాడులో సంచలన విజయం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్.. ఇప్పుడు అటు ఢిల్లీ వేదికగా రాజ్యసభలో అడుగుపెట్టేందుకు, ఇటు రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టు కునేందుకు ఏకకాలంలో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

New Update
Vijay Trisha

Vijay Trisha Photograph: (Vijay Trisha)

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయంతో అధికార పగ్గాలు చేపట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్.. ఇప్పుడు తన తదుపరి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అటు ఢిల్లీ వేదికగా రాజ్యసభలో అడుగుపెట్టేందుకు, ఇటు రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టు కునేందుకు సీఎం విజయ్ ఏకకాలంలో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నిక, అలాగే సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ ఉప ఎన్నికలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు స్థానాలను క్లీన్ స్వీప్ చేసేందుకు టీవీకే వర్గాలు సిద్ధం అవుతున్నాయి.

అన్నాడీఎంకే (AIADMK) నేత సీవీ షణ్ముగం రాజీనామా చేయడంతో తమిళనాడు కోటాలోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి నామినేషన్లు, జూన్ 18న పోలింగ్ జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు నుండి ఒక రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో 'మెజారిటీ ఓటింగ్' పద్ధతిని వర్తింపజేస్తారు. 

మొత్తం అసెంబ్లీ స్థానాలు: 233 (తిరుచ్చి తూర్పు మినహాయించి)కావాల్సిన మ్యాజిక్ ఫిగర్: 50 శాతానికి పైగా ఓట్లు అంటే కనీసం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే (TVK) ప్రస్తుత బలం: స్వతహాగా అధికార టీవీకే పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉంది.మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 ఓట్ల దూరంలో ఉన్న టీవీకేకు కాంగ్రెస్, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్ (IUML), వీసీకే (VCK), సీపీఎం, సీపీఐ ల మద్దతు లభిస్తే విజయం నల్లేరుపై నడకే కానుంది. దీనికి తోడు అన్నాడీఎంకేలోని ఒక అసమ్మతి వర్గం కూడా విజయ్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్:

తొలుత కాంగ్రెస్‌లోని తన ఆప్తమిత్రుడు ప్రవీణ్‌ చక్రవర్తికి ఈ సీటు ఇవ్వాలని విజయ్ భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనివల్ల కూటమిలోని ఇతర పక్షాల నుంచి విభేదాలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. టీవీకేకు చెందిన ఒక సీనియర్ ముఖ్య నేతను గానీ, లేదా సమాజంలో అన్ని రంగాలలో నిష్ణాతుడైన ఒక ప్రముఖ విద్యావేత్త/సభ్యుడిని రాజ్యసభకు పంపేలా విజయ్ కసరత్తు చేస్తున్నారు.

 ముఖ్యమంత్రి విజయ్ గత సాధారణ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించగా.. నిబంధనల ప్రకారం ఆయన తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక నగారా మోగనుంది. సీఎం వదిలేసిన స్థానం కావడంతో ఇక్కడ గెలుపును టీవీకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గంలో సెలబ్రిటీ ఇమేజ్‌ను వాడుకునేందుకు సినీ నటి త్రిషను రంగంలోకి దించుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలా విజయ్ సరికొత్త వ్యూహం పన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ఒక ఉన్నతాధికారిని ఇక్కడ నిలబెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు.మొదటి ఛాయిస్ (సహాయం ఐఏఎస్): తమిళనాడులో నిజాయితీకి, అవినీతి రహిత పాలనకు మారుపేరుగా నిలిచిన మాజీ ఐఏఎస్‌ అధికారి సహాయంను పోటీలో పెట్టేందుకు చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ సహాయం పోటీకి నిరాకరిస్తే, ప్రత్యామ్నాయంగా మరో మాజీ ఐఏఎస్ అధికారిని బరిలోకి దించేలా చర్చలు నడుస్తున్నాయి. అంతకుముందు లాల్గుడి నియోజకవర్గంలో ఓడిపోయిన కూపా కృష్ణన్‌ను ఇక్కడ దించుతారని భావించినా.. ఆయనకు ఇటీవల ప్రభుత్వ బోర్డు పదవి దక్కడంతో రేసు నుండి తప్పుకున్నారు.

డీఎంకే ప్లాన్:

మరోవైపు, ప్రతిపక్ష డీఎంకే (DMK) ఇక్కడ మాజీ మంత్రి, బలమైన నేత అయిన అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళిని రంగంలోకి దించి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. తిరుచ్చి పరిసర ప్రాంతాల్లో అన్బిల్ మహేష్ కుటుంబానికి ఉన్న పట్టును ఉపయోగించుకుని విజయ్ కోటను బద్దలు కొట్టాలనేది డీఎంకే వ్యూహం.
 
రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో, ఢిల్లీ పెద్దల వద్ద తన వాయిస్ వినిపించాలని విజయ్ భావిస్తుండగా.. తిరుచ్చి తూర్పులో గెలిచి రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి తిరుగులేదని నిరూపించాలని చూస్తున్నారు. మరి ఈ రెండు కీలక పరీక్షల్లో 'దళపతి' విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ఎంతవరకు పారుతాయో చూడాలి!

Advertisment
తాజా కథనాలు