/rtv/media/media_files/2026/05/04/vijay-and-prashant-2026-05-04-10-33-50.jpg)
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తుండటంతో, రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో ఎదుర్కొన్న ఘోర పరాజయం, విజయ్‌కు గెలుపు పాఠాలుగా ఎలా మారాయనే చర్చ నడుస్తోంది.
రాజకీయాల్లో వ్యూహకర్తగా తిరుగులేని విజేత అనిపించుకున్న ప్రశాంత్ కిషోర్, తన సొంత పార్టీ జన్ సూరాజ్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారు. 2025 బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడమే కాకుండా, మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద నటుడు విజయ్ అప్రమత్తమయ్యారు. పీకే చేసిన తప్పులేమిటి? వాటిని విజయ్ తన 'గెలుపు సూత్రాలు'గా ఎలా మార్చుకున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రశాంత్ కిషోర్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే.. తన పార్టీకి తానే సర్వస్వం అయినప్పటికీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది ఓటర్లలో ఆయన గెలిస్తేనే కదా మమ్మల్ని పాలించేది? అనే సందేహాన్ని రేకెత్తించింది. ఈ తప్పును గుర్తించిన విజయ్, కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్వయంగా రెండు నియోజకవర్గాల (పెరంబూర్, ట్రిచీ ఈస్ట్) నుంచి పోటీకి దిగారు. తాను కూడా మీతో పాటే యుద్ధంలో ఉన్నాను అనే సంకేతాన్ని కేడర్‌కు పంపారు. పీకే రాజకీయాల్లో అద్భుతమైన వ్యూహకర్త. కానీ కోచ్ ఎప్పుడూ గ్రౌండ్‌లో ఆడి మ్యాచ్‌ను గెలిపించలేడు. ఒక పార్టీ గెలవాలంటే కెప్టెన్ కావాలి. విజయ్ తనకున్న సినిమా ఇమేజ్‌ను కేవలం క్రేజ్‌గానే కాకుండా, రాజకీయ బలంగా మార్చుకున్నారు. పీకే టీవీల్లో, ఇంటర్వ్యూల్లో కనిపించి విశ్లేషణలు ఇస్తే.. విజయ్ నేరుగా ఎన్నికల క్షేత్రంలో నిలబడి ఓట్లు అడిగారు.
బీహార్‌లో పీకే కేవలం అభివృద్ధి అనే మంత్రాన్ని జపించారు, కానీ అక్కడ బలంగా ఉన్న కుల రాజకీయాలను తక్కువ అంచనా వేశారు. ఫలితంగా సామాజిక సమీకరణాల్లో ఆయన వెనుకబడ్డారు. తమిళనాడులో విజయ్ తన నియోజకవర్గాల ఎంపికలోనే చాకచక్యం ప్రదర్శించారు. మైనారిటీలు, దళితులు మరియు యువత ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం ద్వారా సామాజిక సమతుల్యతను పాటించారు.
సోషల్ మీడియా ప్రచారంపై విపరీతంగా ఖర్చు
ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ప్రచారంపై విపరీతంగా ఖర్చు చేశారు. కానీ బూత్ స్థాయిలో ఓట్లు వేయించే కార్యకర్తలు లేక ఓడిపోయారు. విజయ్‌కి దశాబ్దాలుగా ఉన్న అభిమాన సంఘాలే ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగా మారాయి. పీకే దగ్గర లేని శిక్షణ పొందిన సైన్యం విజయ్ దగ్గర ఉండటం ఆయనకు కలిసొచ్చిన పెద్ద ప్లస్ పాయింట్.
బీహార్‌లో పీకే చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన అసంతృప్తి నేతలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇది ఆయన పార్టీ ఆశయాలను నీరుగార్చింది. విజయ్ తన పార్టీలో గరిష్టంగా యువతకు, కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల మార్పు కోరుకునే ఓటర్ల విశ్వాసాన్ని ఆయన గెలుచుకోగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే, ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ ప్రయోగం ద్వారా ఏం చేయకూడదో నేర్పించారు. ఆ పాఠాలను విజయ్ ఒంటబట్టించుకున్నారు. పీకే పరాజయం ఇచ్చిన హెచ్చరికతోనే విజయ్ తన రాజకీయ అరంగేట్రం ఫ్లాప్ కాకుండా, ఒక 'బ్లాక్ బస్టర్ హిట్'గా మార్చుకోగలిగారు. అందుకే ఇప్పుడు రాజకీయ పండితులు అంటున్నారు.
Follow Us