/rtv/media/media_files/2025/09/23/maoists-2025-09-23-10-36-59.jpg)
Maoist movement is over ?
End Of Maoists: ప్రజల కోసమే అన్నలు పేరుతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలపాలు కనిపించవా? ఆరు దశాబ్ధాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే అనేకమంది అగ్రనేతలు ఎన్ కౌంటర్లలో మృతి చెందగా కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న నేతలు పలువురు ఇటీవల లొంగుబాట పట్టడంతో మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసిన గతమేనన్న సంకేతాలు ఇస్తోంది.
ఒకవైపు "2026 మార్చి31 నాటికి నక్సల్ ఉద్యమాన్ని లేకుండా చేస్తాం. వారి కథ ముగించేస్తాం' అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్షరాల నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నెల రోజుల ముందుగానే మావోయిస్టు ఉద్యమం పతనవస్థకు చేరుకుందన్న ప్రచారం సాగుతోంది. దానికి కారణం ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతగా పిలవబడుతున్న దేవ్ జీ లొంగుబాటు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు తీరని నష్టాన్నే మిగిల్చిందని చెప్పచ్చు. కగార్ లో చలపతి, కేశవరావు, హిడ్మా ఇలా అనేక మంది అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. ఈ తరుణంలో కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి అగ్రనేతలు లొంగిపోయారు. తాజాగా పార్టీ కేంద్ర కార్యదర్శిగా చెబుతున్న దేవ్ జీ అలీయాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగిపోవడంతో ఇక మావోయిస్టు శకం ముగిసినట్లేనని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అగ్రనేత గణపతి వృద్దాప్యంతో విదేశాల్లో తలదాచుకున్నారని, మరో నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆచూకీ మాత్రం తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు తుపాకీ పోరాటం ఈ ఏడాదితో చివరిదశకు చేరుకున్నట్లే.
వరుస ఎన్‌కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లు, పలువురు అగ్రనేతల అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బలంగా ఉన్న పీపుల్స్ వార్ ఉద్యమం వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో బలహీన పడుతూ వచ్చింది. ఆ తర్వాత ఏవోబీ కి మాత్రమే పరిమితమైన మావోయిస్టులు బహిరంగంగా జనంలోకి వచ్చి కార్యకలపాలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించడం తప్ప పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్మించే స్థితిలో మావోయిస్టులు లేరు. దీంతో వారంతా కేవలం అడవులకే పరిమితమయ్యారు. ఇక అగ్రనేతలంతా 50 ఏండ్లు దాటిన వారే కావడం, అనారోగ్యాలతో బాధపడుతుండటం, యువత నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడంతో పార్టీ మరింత దెబ్బతింది. బయటనుంచి కూడా వారికి సరైన సహకారం అందే పరిస్థితి లేదు. బయట ఉన్న కవర్ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు నేరుగా మావోయిస్టులను కలిసి చర్చించే పరిస్థితి లేకపోవడంతో కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింది.
ఒకప్పుడు సమస్య వస్తే అన్నలు పరిష్కరిస్తారనే నమ్మకం పేదలకు ఉండేది. ప్రభుత్వాలు, పోలీసులు చేయలేని పని వారు చేస్తారన్న విశ్వాసం ఉండేది. దాంతో ప్రజలు అన్నలను ఆదరించారు. పోలీస్ స్టేషన్ లో జరగని న్యాయం తుపాకీ నీడన జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు అన్నలను ఆశ్రయించేవారు. ప్రజలకు అన్యాయం జరిగినపుడు ప్రజాకోర్టు పేరుతో అన్నలు ఇచ్చే సత్వర తీర్పు ప్రజలకు వారిమీద మరింత విశ్వాసాన్ని పెంచింది. అయితే
రానురాను నిర్భంధం పెరగడంతో ప్రజలకు, అన్నలకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా గతంతో పోలీస్తే మార్పు వచ్చింది. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిండంతో పాటు ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉండటంతో వారు పోలీస్ స్టేషన్‌ల గడప తొక్కడానికి మార్గం సుగమమైంది. దీంతో అన్నలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఆరుపదుల మావోయిస్టు ఉద్యమంలో సాధించిన విజయాలు పక్కన పెడితే.. ఆత్మరక్షణ కోసం అడవుల్లో దాక్కోవడం తప్ప ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు నిర్మించే పరిస్థితి మావోయిస్టులకు లేకుండా పోయింది. మావోయిస్టులు కూడా తుపాకి గొట్టం ద్వారా విప్లవాన్ని సాధిస్తామని చెప్పడం, వర్గ శత్రు నిర్మూలన తప్ప నిర్మాణాత్మక కార్యకలపాలు చేపట్టే పరిస్థితిలో లేకపోవడంతో వారికి ఆధరణ తగ్గతూ వచ్చింది. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ ప్రక్రియద్వారా తమకు నచ్చిన నేతలను ఎన్నుకుంటున్న ప్రస్తుత తరుణంలో తుపాకిన్యాయం మీద ప్రజలకు రోజురోజుకు విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. ఒకప్పుడు ప్రజలు, ప్రభుత్వం, అన్నల మధ్య సాగిన పోరాటం ఇపుడు కేవలం పోలీసులు, నక్సల్స్ అనే స్థితికి చేరుకుంది. కేవలం భద్రతాదళాలతో పోరాడటం తప్ప ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే పరిస్థితి మావోయిస్టులకు లేకుండా పోయింది. ఇది వారికి ప్రజలను దూరం చేసిందనే చెప్పాలి.
అగ్రకులాలు, జమీందారులు, దొరలు, భూస్వాముల వంటి బడా బాబుల చేతుల్లో అన్యాయానికి గురవుతున్న పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడడానికి ఆయుధం ఒక్కటే మార్గమని నమ్మిన నాటి విద్యావంతులైన యువకులు ఎందరో అన్నల బాట పట్టారు. ఉస్మానియ యూనివర్శిటీ, కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్‌ఈసీ) వంటి విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదివినా, చదువుకుంటున్న ఎందరో అడవిబాట పట్టారు. ఆయుధాలు చేత పట్టారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు ,విదేశాలు, ఉన్నత జీవితం అనేది నేటి యువత కాన్సెఫ్ట్. అంతేకాదు పారిశ్రామికీకరణ. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలువుతున్నాయి. దీంతో బడుగు, బలహీన, అగ్ర అనే తేడా లేకుండా అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దీంతో మావోయిస్టుల్లోకి రిక్రూట్ మెంట్లు పూర్తిగా ఆగిపోయాయి.
ఇక బయటి ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. కంప్యూటర్లు, మొబైల్ పోన్లు, డ్రోన్లు, రోబోలు, డిజిటల్ టెక్నాలజీ ఎంతో వృద్ధి చెందింది.. ఈ టెక్నాలజీని మావోయిస్టులు ప్రస్తుత ఉద్యమానికి అన్వయించుకోలేకపోయారు. దీంతో వారికి అర్భన్ ప్రాంతంలో ఉన్న సానుభూతిపరులు, ప్రజాసంఘాల నుంచి సమాచారం సేకరించడం కష్టసాధ్యమైంది. మొబైల్ వంటి సాధనాలు వారి ఉనికిని పసిగట్టడానికి సులువైన మార్గాలుగా మారాయి. డ్రోన్లు, తేలికపాటి విమనాలు అడవుల్లో వారి స్థావరాలను టార్గెట్ చేయడానికి ఈజీగామారాయి.
నోట్ల మార్పిడి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ తీసింది. పార్టీ వద్ద పోగైన కోట్లాది రూపాయాలను మార్పిడి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆధునిక ఆయుధాలు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో భద్రతా దళాలతో పోరాడే సమయంలో వారికి సంప్రదాయ ఆయుధాలు తప్ప మరోమార్గం లేకుండాపోయింది. మావోయిస్టుల వద్ద పేరుకుపోయిన సుమారు 20 నుంచి 50 కోట్ల రూపాయల పాత నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం వారికి చిక్కలేదు. కొంత ధనాన్ని మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల ద్వారా మార్చుకున్నప్పటికీ అది పార్టీ కార్యకలపాలకు ఏమాత్రం సరిపోలేదు.అంతేకాక కొంతమంది సానుభూతి పరులు, ప్రజాసంఘాల నేతలు నోట్ల మార్పిడి కోసం తీసుకున్న డబ్బులను పార్టీకి తిరిగి చెల్లించలేదని ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత ఒకరు చెప్పడం గమనార్హం. ఇలా ఆర్థికంగా కూడా మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు.
ఇక చివరిగా మావోయిస్టు ఉద్యమం ప్రజాఉద్యమంగా మార్పు చెందాల్సిన సమయంలో ఆ దిశలో అడుగులు వేయలేకపోయిందనే చెప్పాలి. దండకారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర ప్రజలకు ఉపకరించే పనులు కొద్దో గొప్పో చేసినప్పటికీ అక్కడి ప్రజలు సైతం నేడు అభివృద్దిని కోరుకుంటున్నారు. ఏండ్ల తరబడి విద్యుత్, రోడ్లు, విద్య, తాగునీరు, వాహన సౌకర్యం వంటి కనీస వసతులను చూడలేని ఆదివాసీలు ఇపుడిపుడే ఆధునికతవైపు అడుగులు వేస్తున్నారు. వారు అన్నలకంటే అత్యావసరాల వైపే మొగ్గు చూపుతున్నారనేది ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ తరుణంలో అడవుల్లో అన్నలకు కనీస మద్దతు లభించే అవకాశాలు అంతంత మాత్రమే. ఈ తరుణంలో అగ్రనేతలకు లొంగుబాటు తప్ప మరో మార్గం లేదనే చెప్పాలి. లొంగిపోయిన నాయకులు బాహ్య ప్రపంచంలో ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తారా? లేక ప్రభుత్వం చూపే ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఉద్యమాలకు చరమగీతం పాడుతారా అనేది పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మావోయిస్టు సాయుధ పోరాటానికి చివరి అంకమే అన్నది మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమే అన్నది అక్షర సత్యం.
మధుకర్ వైద్యుల
సీనియర్ జర్నలిస్ట్
8096677409
Follow Us