TMC : మమతా బెనర్జీకి భారీ షాక్: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రెబెల్ లీడర్!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ రాజకీయ అలజడి రేగింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె పార్టీకి చెందిన రెబెల్స్ గట్టి షాక్ ఇచ్చారు.

New Update
mamata

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ రాజకీయ అలజడి రేగింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె పార్టీకి చెందిన రెబెల్స్ గట్టి షాక్ ఇచ్చారు. టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన రెబెల్ నాయకుడు రితబ్రత బెనర్జీ.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కొత్త ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఆమోదం ముద్ర

తనకు మద్దతు ఇస్తున్న 58 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను రితబ్రత బెనర్జీ స్పీకర్‌కు సమర్పించారు. దీనిని పరిశీలించిన స్పీకర్.. అసెంబ్లీలో మారిన ఈ సమీకరణాలకు ఆమోదం ముద్ర వేశారు. అంతేకాదు, ప్రతిపక్ష నేతకు కేటాయించే అధికారిక చాంబర్‌ను కూడా రితబ్రతకు అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్రం వెలుపల ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమతోనే ఉన్నారని, త్వరలోనే తమ బలం ఇంకా పెరుగుతుందని రెబెల్ వర్గం ప్రకటించింది.

ఈ సందర్భంగా రితబ్రత బెనర్జీ అసెంబ్లీలో తమ కొత్త టీమ్‌ను కూడా ప్రకటించారు. అఖ్రుజ్జమాన్‌ను చీఫ్ విప్ గా, సీనియర్ ఎమ్మెల్యేలు జావేద్ అహ్మద్ ఖాన్, సందీపన్ సాహా, సబినా యాస్మిన్, షియులీ సాహాలను డిప్యూటీ లీడర్లుగా నియమించినట్లు వెల్లడించారు.

పార్టీలో ఇంత పెద్ద తిరుగుబాటు నడుస్తున్నప్పటికీ, రితబ్రత బెనర్జీ తమ అధినేత్రి మమతా బెనర్జీకి ఒక వింత విజ్ఞప్తి చేశారు. తాము విడిపోయినా సరే, అసెంబ్లీలో తమ శాసనసభా పక్షానికి చీఫ్ అడ్వైజర్ గా ఉంటూ తమకు మార్గదర్శకత్వం చేయాలని ఆమెను కోరారు. అయితే, మమతా బెనర్జీ వారసుడిగా భావించే ఎంపీ అభిషేక్ బెనర్జీతో మాత్రం తమకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

కొద్దిరోజుల క్రితం టీఎంసీ అధిష్టానం సీనియర్ ఎమ్మెల్యే శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసింది. అయితే, ఆయనకు మద్దతుగా ఇచ్చిన లేఖలో చాలామంది ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారంటూ రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బెంగాల్ సీఐడీ విచారణ కూడా మొదలైంది. దీంతో ఆగ్రహించిన టీఎంసీ అధిష్టానం రితబ్రత, సందీపన్‌లను పార్టీ నుంచి బహిష్కరించింది.

Advertisment
తాజా కథనాలు