/rtv/media/media_files/2026/04/28/tmc-2026-04-28-20-56-26.jpg)
బెంగాల్ పాలిటిక్స్‌లో ఇప్పుడు సినిమా డైలాగులు పేలుతున్నాయి. ఎన్నికల అబ్జర్వర్‌గా వచ్చిన ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు మధ్య గట్టి పోరు నడుస్తోంది.ఆయన తనని తాను సింగం అనుకుంటున్నారేమో.. కానీ నేను పుష్ప.. తగ్గేదే లే అంటూ జహంగీర్ ఖాన్ చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి.
అసలేం జరిగింది?
యూపీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం అబ్జర్వర్‌గా ఫాల్టా ప్రాంతానికి పంపింది. జహంగీర్ ఖాన్ అనుచరులు ఓటర్ల ఐడీ కార్డులు గుంజుకుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ ఆఫీసర్ నేరుగా జహంగీర్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న ఖాన్ బంధువులతో మాట్లాడుతూ.. జహంగీర్‌కు చెప్పండి.. ఓటర్లను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు, గట్టి యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
పుష్ప స్టైల్‌లో కౌంటర్
దీనిపై జహంగీర్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది బెంగాల్.. ఇక్కడ యూపీ పోలీసుల బెదిరింపులు సాగవు. ఆయన సింగం అయితే నేను పుష్పని అంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు ఒక పోలీస్ అబ్జర్వర్ నేరుగా ఇంటికి వచ్చి ఎలా బెదిరిస్తారని, ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ వారు ఇలాంటి అధికారులను పంపి తమను భయపెడుతున్నారని ఆరోపించారు.
ఈ గొడవ తర్వాత టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి జై బంగ్లా అంటూ నినాదాలు చేశారు. ఆఫీసర్ వెళ్తున్న కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు, సెంట్రల్ ఫోర్స్, అజయ్ పాల్ శర్మ రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి మహిళలను ఇబ్బంది పెట్టారని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి కొత్త మలుపునిచ్చింది.
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఈ వివాదంలో తలదూర్చారు. సదరు అధికారి డ్యాన్స్ చేస్తున్న పాత వీడియోను షేర్ చేస్తూ.. మీ పోలీసింగ్ నైపుణ్యాలు మీ డ్యాన్స్ కంటే బాగుంటాయని ఆశిస్తున్నాను అంటూ ఎద్దేవా చేశారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఈ ఫాల్టా ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ సెగలు మామూలుగా లేవు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ సింగం - పుష్ప ఫైట్ ఎటు దారితీస్తుందో చూడాలి!
Follow Us