/rtv/media/media_files/2026/04/16/tcs-2026-04-16-15-59-23.jpg)
నాసిక్ నగరంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ బిపిఓ యూనిట్‌లో వెలుగుచూసిన మత మార్పిడి, వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో బాధితులకు అండగా ఉండాల్సిన మహిళా ఆపరేషన్స్ హెడ్ , హెచ్‌ఆర్ మేనేజర్లే నిందితులకు మద్దతుగా నిలవడం గమనార్హం. ఒక మహిళా బాధితురాలు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అంటూ ఆమెను నిరుత్సాహపరిచారని నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ తెలిపారు. ఈ దారుణమైన ఘటనలో మొత్తం తొమ్మిది కేసులు నమోదవగా, పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు పురుషులు, ఒక మహిళా అధికారి ఉన్నారు, కాగా మరో మహిళా ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉంది.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. నిందితులుగా ఉన్న ఏడుగురు పురుషులు ఒక ముఠాగా ఏర్పడి, కార్యాలయంలోని మహిళా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడినట్లు తేలింది. డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మేమన్, షారూఖ్ ఖురేషి వంటి నిందితులు తమ అధికారాన్ని ఉపయోగించి సహోద్యోగులను ఇబ్బందులకు గురిచేశారు.
మత మార్పిడికి ప్రేరేపించారని
కేవలం మహిళలే కాకుండా, ఒక పురుష ఉద్యోగి కూడా తనను మత మార్పిడికి ప్రేరేపించారని, పని ప్రదేశంలో వేధించారని ఫిర్యాదు చేయడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. గతంలోనే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్న లైంగిక, మానసిక వేధింపుల గురించి హెచ్‌ఆర్ విభాగానికి మొరపెట్టుకున్నా, వారు పట్టించుకోకపోవడంతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అత్యంత ఆందోళనకరమైన విషయంగా అభివర్ణించారు. కంపెనీ తరపున సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చడానికి టీసీఎస్ సీఓఓ ఆరతి సుబ్రమణియన్‌ను బాధ్యురాలిగా నియమించారు. మరోవైపు, ఈ కేసులో విదేశీ నిధులు లేదా తీవ్రవాద సంస్థల ప్రమేయం ఉండవచ్చనే అనుమానాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ మేరకు ఎస్.ఐ.డి, ఏ.టి.ఎస్ , ఎన్.ఐ.ఏ వంటి కీలక ఏజెన్సీల సహాయాన్ని నాసిక్ పోలీసులు కోరారు. నాసిక్ క్యాంపస్‌లో BPO కార్యకలాపాలను TCS తాత్కాలికంగా నిలిపివేసింది. లైంగిక ఆరోపణలు, మత మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాతి నోటీస్ ఇచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కంపెనీ అక్కడి ఉద్యోగులకు సూచించింది.
మహిళా పోలీస్ అధికారులు కార్యాలయంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో మరికొంతమంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం అరెస్టయిన మహిళా ఆపరేషన్స్ మేనేజర్‌కు కోర్టు ఏప్రిల్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Follow Us