/rtv/media/media_files/2026/02/18/robot-dogs-are-chinese-2026-02-18-19-14-37.jpg)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఇది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు, 21వ శతాబ్దపు సరికొత్త యుద్ధభూమి. ఇక్కడ తుపాకులు, బాంబులు లేవు కానీ.. అల్గోరిథమ్స్, డేటా, కోడింగ్ రాసే యువత మధ్య తీవ్ర పోటీ ఉంది. అమెరికా, చైనా, జర్మనీ వంటి దేశాలు ఏఐలో ఆధిపత్యం కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి కీలక టైంలో ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో చోటుచేసుకున్న ఒక ఘటన భారతీయ సాంకేతిక ప్రతిష్టపై మచ్చ వేసింది.
అసలేం జరిగింది?
గ్రేటర్ నోయిడాకు చెందిన గాల్గోటియాస్ యూనివర్సిటీ ఈ సదస్సులో “Orion” పేరుతో ఒక రోబోటిక్ డాగ్‌ను ప్రదర్శించింది. ఇది తమ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో తయారైందని చెప్పడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ప్రపంచ టెక్ కమ్యూనిటీ దీని అసలు గుట్టును రట్టు చేసింది. ఆ రోబో నిజానికి చైనాకు చెందిన 'Unitree' కంపెనీ తయారు చేసిన Go2 మోడల్. దీన్ని ఆన్లైన్లో ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.
ఇన్నోవేషనా? ఇంపోర్టా?
"చైనా నుంచి కొనుగోలు చేసిన రోబోను పెట్టి, స్వదేశీ ఆవిష్కరణ అని ఎలా చెబుతారు?" అంటూ నెటిజన్లు ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. వివాదం ముదరడంతో యూనివర్సిటీ యాజమాన్యం వివరణ ఇస్తూ.. తాము దీన్ని తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని, కేవలం విద్యార్థుల ప్రాక్టీస్ కోసం కొన్నామని దొంగతనాన్ని ఒప్పేసుకుంది. కానీ, గ్లోబల్ సమ్మిట్ ప్రారంభంలోనే ఈ విషయాన్ని పారదర్శకంగా ఎందుకు చెప్పలేదన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
దేశ ప్రతిష్టకు మచ్చ
భారతీయ ఇంజనీర్లు ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో రాణిస్తున్నారు. మన దేశం ఏఐ సూపర్ పవర్ కావాలని కలలు కంటోంది. ఇలాంటి సమయంలో గ్లోబల్ స్టేజ్ మీద జరిగిన ఈ చిన్న తప్పు మన దేశ 'క్రెడిబిలిటీ'ని (విశ్వసనీయత) దెబ్బతీసింది. ఇన్నోవేషన్ అంటే అసెంబ్లింగ్ చేయడం కాదు.. అది ఒక మేధో సంపత్తి (IP Ownership). ఒరిజినాలిటీ లేని ప్రదర్శనలు ప్రపంచం ముందు మనల్ని తలదించుకునేలా చేస్తాయి.
ఇదొక హెచ్చరిక!
మనం ఏఐలో అగ్రగామిగా ఎదగాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పీఆర్ స్టంట్లు సరిపోవు. కాపీ చేయడం సులభం, కానీ క్రియేట్ చేయడం కష్టం. షార్ట్‌కట్‌లతో హెడ్ లైన్స్‌లో పేరు రావచ్చు కానీ, హిస్టరీలో నిలవాలంటే నిజాయితీ ఉండాలి. ఈ ట్రోలింగ్ మన యూనివర్సిటీలకు, పాలకులకు ఒక 'వేక్ అప్ కాల్'. ఇప్పటికైనా మేల్కొని స్వదేశీ పరిజ్ఞానంతో నిజమైన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
Follow Us