Prachi Nigam : నాడు ఎగతాళి చేసిన నోళ్లే నేడు అభినందిస్తున్నాయి...ఇంటర్ ఫలితాల్లోనూ మెరిసిన ప్రాచీ నిగమ్

తన ముఖంపై వెంట్రుకల కారణంగా తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైన ఉత్తరప్రదేశ్ విద్యార్థిని ప్రాచీ నిగమ్ మరోసారి తన అద్భుత ప్రతిభతో విమర్శకుల నోళ్లు మూయించారు. పదో తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచిన ఆమె తాజాగా 12వ తరగతి ఫలితాల్లో 91.20% మార్కులతో సత్తా చాటారు.

New Update
FotoJet - 2026-04-27T171356.692

UP Board Class 12th Topper Prachi Nigam

Prachi Nigam : గత ఏడాది సోషల్ మీడియాలో తన ముఖంపై వెంట్రుకల కారణంగా తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైన ఉత్తరప్రదేశ్ విద్యార్థిని ప్రాచీ నిగమ్, మరోసారి తన అద్భుత ప్రతిభతో విమర్శకుల నోళ్లు మూయించారు. యూపీ బోర్డు పదో తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచినప్పుడు పొగడ్తలతో పాటు అవమానాలను కూడా ఎదుర్కొన్న ఈమె, తాజాగా విడుదలైన 12వ తరగతి ఫలితాల్లో 91.20% మార్కులతో సత్తా చాటారు.సీతాపూర్ జిల్లాకు చెందిన ప్రాచీ నిగమ్, చదువుపై తనకున్న మక్కువను ఏ బాహ్య విమర్శలు అడ్డుకోలేవని నిరూపించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆమె సాధించిన మార్కులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

ఆమె గణితంలో 99%, హిందీలో 96%, కెమిస్ట్రీలో 95%, ఫిజిక్స్ లో 93% శాతం మార్కులు సాధించారు. ఇక కేవలం ఇంగ్లీష్‌పై పట్టు తక్కువగా ఉండటంతో ఆ సబ్జెక్టులో 73 మార్కులు వచ్చాయి. ప్రస్తుతం తాను జేఈఈ (JEE) వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, అందుకే ఇంగ్లీష్‌పై తక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చిందని ఆమె వివరించారు. దేశంలోని అత్యున్నత ఐఐటీ (IIT)లలో ఇంజనీరింగ్ పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రాచీ ధీమాగా చెబుతున్నారు.

2024లో పదో తరగతి ఫలితాల్లో 600కు గాను 591 మార్కులు సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినప్పుడు, ఆమె రూపంపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు. ఆ సమయంలో ప్రాచీ ఎంతో పరిణితితో స్పందించారు. "దేవుడు నన్ను ఎలా సృష్టించినా నాకు ఇబ్బంది లేదు. నా రూపం గురించి ఇతరులు ఏమనుకున్నా నాకు అనవసరం. గొప్ప మేధావి చాణక్యుడిని కూడా ఒకప్పుడు ఎగతాళి చేశారు, కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు.. నేను కూడా అంతే" అని ఆమె అన్న మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రాచీ నిగమ్ తన ప్రయాణం గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "బహుశా నాకు కొన్ని మార్కులు తక్కువ వచ్చి ఉంటే, నేను టాపర్‌గా నిలిచేదాన్ని కాదు.. ఇంత ఫేమస్ అయ్యేదాన్ని కూడా కాదు. బహుశా అదే మంచిదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రజలు ఆడపిల్లలకు ముఖంపై వెంట్రుకలు ఉండటం చూసి వింతగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితులను నేను చాలా కాలంగా ఎదుర్కొంటున్నాను, కాబట్టి ఇప్పుడు అవేమీ నన్ను బాధించవు" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అవమానాలను ఎదుర్కొంటూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ప్రాచీ నిగమ్ జీవితం నేటి తరం విద్యార్థులకు ఒక గొప్ప ఉదాహరణ. బాహ్య సౌందర్యం కంటే సంకల్పం, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆమె నిరూపిస్తున్నారు. ఆమె ప్రతిభను చూసి ఇప్పుడు దేశం గర్విస్తోంది.

Advertisment
తాజా కథనాలు