/rtv/media/media_files/2026/06/16/vijay-cm-2026-06-16-14-17-39.jpg)
తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీ పథకంలో కొన్ని మార్పులు చేస్తూ సవరించిన కొత్త నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. ఈ కొత్త పథకం ప్రకారం, భూమి ఎంత ఉందనే దానితో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ రూ. 75,000 వరకు పంట రుణాలు మాఫీ కానున్నాయి. 2025 మే 1 నుండి 2026 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో సహకార బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ సవరించిన పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ తాజా ప్రకటన ప్రకారం.. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా అందరికీ ప్రయోజనం కలగనుంది. సహకార బ్యాంకుల్లో రూ. 75,000 లోపు పంట రుణాలు ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ రుణం మొత్తం రూ. 75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి రూ. 35,000 వరకు రుణాన్ని మాఫీ చేస్తారు. ఈ సవరించిన నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14.43 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని, దీనికోసం ప్రభుత్వం రూ. 5,932.23 కోట్ల ఖర్చును భరించనుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు, మే 25వ తేదీన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే రూ. 50,000 వరకు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పాత ప్రకటనపై రైతు వర్గాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పథకాన్ని మార్చాలని, అందరికీ న్యాయం జరిగేలా పునర్వ్యవస్థీకరించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేశారు.
రైతులకు రూ. 3,599.67 కోట్లు
రైతుల నుంచి వచ్చిన డిమాండ్లపై స్పందించిన సీఎం విజయ్, జూన్ 15వ తేదీన మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన తర్వాతే రుణమాఫీ పథకాన్ని మార్చాలని నిర్ణయించారు. ఈ కొత్త సవరించిన పథకం కింద మొత్తం 8,33,773 మంది సన్నకారు రైతులకు రూ. 3,599.67 కోట్లు, 5,16,183 మంది చిన్న రైతులకు రూ. 1,995.42 కోట్లు, 93,548 మంది పెద్ద రైతులకు రూ. 337.15 కోట్ల చొప్పున రుణమాఫీ సొమ్ము అందుతుందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Follow Us