Tamil Nadu CM Vijay : ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్..ఢిల్లీలో బిజీబిజీ

తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సి.జోసెఫ్ విజయ్ బుధవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న ఆయనకు అక్కడ సాదర స్వాగతం లభించింది.

New Update
FotoJet (40)

Vijay meets PM Modi

Tamil Nadu CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సి.జోసెఫ్ విజయ్ బుధవారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న సీఎం విజయ్‌కు అక్కడ గౌరవ వందనంతో సాదర స్వాగతం లభించింది. అనంతరం ఆయన నేరుగా ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని కలుసుకున్నారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ అధికారిక సమావేశంలో తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంది.

FotoJet (41)

చారిత్రక శాసనాల వాపసీపై మోదీకి కృతజ్ఞతలు

ఈ భేటీలో చోళుల కాలం నాటి చారిత్రక వారసత్వాన్ని భారత్‌కు రప్పించడంపై ప్రత్యేక చర్చ జరిగింది. ఇటీవల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా, అక్కడి నుంచి చోళుల నాటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘అనైమంగళం’ రాగి శాసనాలను తిరిగి భారతదేశానికి రప్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రత్యేక కృషిని సీఎం విజయ్ అభినందించారు. తమిళ సంస్కృతి, చరిత్రకు చిహ్నమైన ఈ రాగి శాసనాలను దేశానికి తిరిగి తెచ్చినందుకు తమిళనాడు ప్రజల తరపున ప్రధానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మేకేదాటు వివాదం, శ్రీలంక మత్స్యకారుల సమస్యలపై చర్చ

తమిళనాడు రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో ఉన్న మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టు వివాదాన్ని సీఎం విజయ్ ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల దిగువన ఉన్న తమిళనాడు ప్రాంతాలపై పడే తీవ్ర ప్రభావాన్ని వివరించారు. దీనితో పాటు, తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక నౌకాదళం జరుపుతున్న దాడులు, అరెస్టుల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 12 అరెస్టులు నమోదయ్యాయని, ప్రస్తుతం 58 మంది తమిళ మత్స్యకారులు శ్రీలంక నిర్బంధంలో ఉన్నారని ప్రధానికి వివరించిన విజయ్.. వారిని, వారి పడవలను తక్షణమే విడుదల చేసేలా శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

'తమిళ్ తాయ్ వాళ్తు' ఆలపించేందుకు అనుమతి

రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన మరో కీలక విజ్ఞప్తిని కూడా సీఎం విజయ్ ప్రధాని ముందుంచారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తమిళనాడు రాష్ట్ర ప్రార్థనా గీతమైన ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ఆలపించేందుకు వీలుగా తగిన ఆదేశాలను జారీ చేయాలని ప్రధానమంత్రిని కోరారు. తమిళ ప్రజల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజకీయ ప్రముఖులతో వరుస భేటీలు

ప్రధాని మోదీతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీలో పలువురు రాజకీయ అగ్రనేతలను కలుసుకోనున్నారు. తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే, 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో కూడా విజయ్ భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జన్‌పథ్ వెలుపల రాహుల్-విజయ్ ఫ్లెక్సీలు, పోస్టర్లు భారీగా వెలిశాయి. వీటితో పాటు వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీల నేతలు సైతం తమిళనాడు హౌస్‌కు వచ్చి ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు.

Advertisment
తాజా కథనాలు