/rtv/media/media_files/2026/05/26/tamilnadu-cm-vijay-appointed-senior-ips-bhavaneeswari-2026-05-26-21-01-56.jpg)
Tamilnadu Cm Vijay Appointed Senior Ips Bhavaneeswari As Ig Of Singapenn Special Task Force
Tamil Nadu : తమిళనాడులో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి విజయ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతను పటిష్టం చేసేందుకు కొత్తగా ఏర్పాటైన ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్’ (STF) బాధ్యతలను రాష్ట్రంలో ‘లేడీ సింగం’గా పేరుగాంచిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి కె. భవానీశ్వరికి అప్పగించారు. ఈ మేరకు ఆమెను ఎస్టీఎఫ్ ఐజీపీ (ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి క్షేత్రస్థాయి పాలన, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం విజయ్.. మహిళల రక్షణ కోసం ఒక బలమైన విభాగాన్ని, అంతే సమర్థురాలైన అధికారిణిని రంగంలోకి దించాలని భావించారు. భవానీశ్వరి అద్భుతమైన ట్రాక్ రికార్డ్, నేరస్థుల పట్ల ఆమెకున్న కఠినమైన వైఖరిని పరిశీలించిన అనంతరం సీఎం విజయ్ ఆమెను ఈ అత్యున్నత పదవికి ఎంపిక చేశారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐజీ భవానీశ్వరి రంగంలోకి దిగి, సాధారణ పోలీసు వ్యవస్థకు అదనంగా పనిచేసేలా ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన సిబ్బంది నియామకాలపై పూర్తి నిఘా పెట్టారు.మహిళల సంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, ఐటీ కారిడార్లు వంటి రద్దీ ప్రాంతాలలో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను రంగం లోకి దించేలా భవానీశ్వరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మహిళల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించ డంతో పాటు, నేరాలు జరిగినప్పుడు విచారణను అత్యంత వేగవంతం చేసి నేరస్థులకు వేగంగా శిక్ష పడేలా ఈ వ్యవస్థ ను బలోపేతం చేయనున్నారు. తప్పు చేయాలంటేనే అసాంఘిక శక్తులు వణికిపోయేలా ఈ ఎస్టీఎఫ్ టీమ్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలను కూడా ప్రభుత్వం కట్టబెట్టనుంది.
కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ వరకు.. భవానీశ్వరి ప్రస్థానం
ఐపీఎస్ భవానీశ్వరిది తమిళనాడు కాగా, ఆమె తండ్రి పోలీస్ శాఖలో డీఎస్పీగా పనిచేశారు. తండ్రి సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకుని చిన్నతనం నుంచే ఖాకీ దుస్తులపై మక్కువ పెంచుకున్న ఆమె, ఇంటర్మీడియట్ పూర్తి కాగానే పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు. అయినప్పటికీ తన అసలు లక్ష్యమైన ఐపీఎస్‌ను మర్చిపోకుండా ఉద్యోగం చేస్తూనే డిగ్రీ, ఎం.ఏ, ఎం.ఫిల్ పూర్తి చేశారు. చివరకు తన కఠిన శ్రమతో 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.
నిర్వహించిన కీలక బాధ్యతలు,అందుకున్న ప్రతిష్టాత్మక పురస్కారాలు
కన్యాకుమారి ఎస్పీ, చెన్నై డీసీపీ, చెన్నై ట్రాఫిక్ ఏసీపీ గా 2017: విశిష్ట సేవా పతకం
ఎస్‌ఐసీ ఐజీ, సీఎంఆర్‌ఎల్ సీఎస్‌వో, డీవీఏసీ జేడీ, వెస్ట్‌జోన్ డీఐజీ 2023: ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ (రాష్ట్రపతి పోలీస్ పతకం)
కరోనా సమయంలో తమిళనాడు స్పెషల్ నోడల్ ఆఫీసర్ 2024: కృష్ణగిరి ఎన్‌సీసీ బాలికల లైంగిక వేధింపుల కేసు విచారణకు సిట్ (SIT) లీడర్
మహిళా రక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సీఎం విజయ్ ప్రారంభించిన 'సింగప్పెన్' ప్రత్యేక బలగాలకు భవానీశ్వరి నాయకత్వం వహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అపారమైన అనుభవం, నేరస్థులపై ఉక్కుపాదం మోపే నైజం ఉన్న భవానీశ్వరి నేతృత్వంలో తమిళనాడులో మహిళల భద్రతకు సరికొత్త భరోసా లభిస్తుందని ప్రభుత్వం, ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
Follow Us