కశ్మీర్ వేర్పాటువాదికి సుప్రీంకోర్టులో ఊరట.. ఆరేళ్ల తర్వాత బెయిల్

కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ అహ్మద్ షాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత ఆరేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ధర్మాసనం మంజూరు చేసింది. ఆయనపై నమోదైన టెర్రర్ ఫండింగ్ కేసులో ఈ కీలక నిర్ణయం వెలువడింది.

New Update
_Kashmiri separatist leader

కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ అహ్మద్ షాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత ఆరేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ధర్మాసనం మంజూరు చేసింది. కశ్మీర్ లోయలో వేర్పాటువాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు (టెర్రర్ ఫండింగ్) నమోదైన కేసులో ఈ కీలక నిర్ణయం వెలువడింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్నది. షా తరఫు న్యాయవాది కోర్టుకు పలు కీలక అంశాలను వివరించారు. 

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో షా పేరు లేదని, కేవలం అదనపు అభియోగ పత్రంలోనే ఆయనను నిందితుడిగా చేర్చారని న్యాయవాది వాదించారు. 2017లో కేసు నమోదవ్వగా, 2019లో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటికే ఆరేళ్లకు పైగా ఆయన జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో సుమారు 400 మంది సాక్షులను విచారించాల్సి ఉందని, విచారణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

మరోవైపు, దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. వేర్పాటువాద కార్యకలాపాల్లో షబీర్ అహ్మద్ షా పాత్ర కీలకమని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం చివరికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ హైకోర్టు తిరస్కరణ.. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
గతంలో ఇదే కేసుపై షా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పట్లో హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని నమ్మేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని, అంతేకాకుండా ఆయనపై ఇలాంటి తరహావే దాదాపు 24 కేసులు ఉన్నాయని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ షా సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

కశ్మీర్‌లో అశాంతిని రేకెత్తించడానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు విదేశీ నిధులు మళ్లించారనే ఆరోపణలపై 2017లో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే 2019లో షాను అరెస్టు చేశారు. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆయనకు ఆరేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చే మార్గం సుగమమైంది.

Advertisment
తాజా కథనాలు