Karnataka : కర్ణాటక సీఎం శివకుమార్‌ కు షాక్‌...మంత్రి పదవికి సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా!

కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజుల్లోనే తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.

New Update
FotoJet - 2026-06-05T103021.447

Senior leader Ramalinga Reddy resigns from ministerial post!

Karnataka : కర్ణాటకలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజుల్లోనే తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. బుధవారం ఘనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రివర్గంలో శాఖల కేటాయింపు జరిగిన గంటల వ్యవధిలోనే అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. కేబినెట్ గెజిట్ విడుదలైన వెంటనే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం డీకే శివకుమార్ సర్కార్‌కు ఆదిలోనే గట్టి కుదుపుగా మారింది.

రామలింగారెడ్డి రాజీనామాకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట తప్పడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో తానే స్వయంగా బెంగళూరు నగర అభివృద్ధి శాఖను ఇస్తానని రామలింగారెడ్డికి సీఎం హామీ ఇచ్చారు. "తాను రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి అవుతానని, ఆ సమయంలో తన వద్ద ఉన్న బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖను మీకు అప్పగిస్తానని" డీకే శివకుమార్ వాగ్దానం చేసినట్లు రామలింగారెడ్డి మీడియా ముందు బహిరంగపరిచారు. అయితే, అధికారిక జాబితాలో ఆ శాఖను కృష్ణ బైరగౌడకు కేటాయించడంతో తీవ్ర ఆవేదనకు గురైన రామలింగారెడ్డి, ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకే తాను వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు.

గతంలో సిద్ధరామయ్య కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన చరిత్ర రామలింగారెడ్డికి ఉంది. ప్రస్తుత కేబినెట్‌లో తనకు ఏమాత్రం అవగాహన లేని భారీ, మధ్యతరహా నీటిపారుదల (ఇరిగేషన్) శాఖను కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. తాను ఏనాడూ పదవుల కోసం డిమాండ్ చేయలేదని, వీరప్ప మొయిలీ కాలం నుండి పలువురి కేబినెట్లలో పనిచేసిన తనను పదే పదే అవమానించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా ఉన్న తన ప్రాధాన్యతను తగ్గించేలా ఈ కేటాయింపులు ఉన్నాయన్నది ఆయన ప్రధాన అభ్యంతరం.

బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఆ ప్రాంతంలో బలమైన పట్టున్న రామలింగారెడ్డి లాంటి సీనియర్ నేత రాజీనామా చేయడం పార్టీకి భారీ నష్టం చేకూరుస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ సంక్షోభం తెరపైకి రాగానే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, విధాన సౌధలో రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడలతో సుదీర్ఘంగా అత్యవసర చర్చలు జరిపారు. అనంతరం మాజీ సీఎం సిద్ధరామయ్యతో కూడా భేటీ అయి సలహాలు తీసుకున్నారు. గతంలోనూ రామలింగారెడ్డి అలక పూనినప్పుడు హైకమాండ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసిన నేపథ్యంలో, ఈసారి కూడా కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను శాంతింపజేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో కేవలం రామలింగారెడ్డి మాత్రమే కాకుండా ఇతర కీలక నేతల నుండి కూడా ఒత్తిళ్లు పెరుగుతుండటం హైకమాండ్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకరిని బుజ్జగిస్తే మరొకరు అలకపాన్పు ఎక్కుతుండటంతో కాంగ్రెస్ సర్కార్‌లో ముసలం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అత్యంత కీలకమైన హోం శాఖ కోసం ప్రియాంక్ ఖర్గే లాంటి నేతలు పట్టుబడుతుండటం గమనార్హం. బెంగళూరు లాంటి కీలక ప్రాంతంలో నెలకొన్న ఈ అసంతృప్తి రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఇతర మంత్రుల కీలక శాఖల వివరాలు

ఈ వివాదాల నడుమ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ, క్యాబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగం,పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. మిగిలిన కీలక నేతల శాఖల వివరాలు ఇలా ఉన్నాయి:

మంత్రి పేరు                                              కేటాయించిన శాఖలు

జి. పరమేశ్వర (డిప్యూటీ సీఎం)                  రెవెన్యూ, క్రీడా శాఖలు
ప్రియాంక్ ఖర్గే                                           హోం మంత్రిత్వ శాఖ (ఇంటెలిజెన్స్ మినహా), ఐటీ, బయోటెక్నాలజీ, ఈ-గవర్నెన్స్
యతీంద్ర (సిద్ధరామయ్య కుమారుడు)      పట్టణాభివృద్ధి (అర్బన్ డెవలప్‌మెంట్) శాఖ
కృష్ణ బైరెగౌడ                                            బృహత్ బెంగళూరు అభివృద్ధి (గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్)

#karnataka #dk shiv kumar as karnataka cm #Congress Karnataka #dk shivakumar cm #Ramalinga Reddy #Minister's resignation
Advertisment
తాజా కథనాలు