/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-11-35-08.jpg)
KC Venugopal and Shashi Tharoor
CM of Kerala : కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ప్రకారం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) అధికారం దిశగా దూసుకుపోతోంది. ఈ విజయ సంకేతాలతో కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ఐదుగురు ప్రముఖ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
1. వీడీ సతీశన్: బలమైన వాణి
కేరళ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. 2001 నుండి ఎర్నాకులం జిల్లాలోని పరవూర్ నియోజకవర్గం నుండి వరుసగా గెలుస్తున్న ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. కూటమిలోని కీలక భాగస్వామి ఐయూఎంఎల్ (IUML) మద్దతు కూడా ఆయనకు ఉండటం కలిసొచ్చే అంశం. హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం, కార్మిక సంఘాల్లో పట్టు ఉన్న సతీశన్, పార్టీలో సమర్థుడైన నేతగా గుర్తింపు పొందారు.
2. సన్నీ జోసెఫ్: సంస్థాగత బలం
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా ఉన్న సన్నీ జోసెఫ్ పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మే 2025లో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి రాజకీయాల (KSU) నుండి ఎదిగిన ఆయన, కన్నూర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 'సన్నీ వకీల్'గా పిలవబడే ఆయన, పార్టీ కేడర్‌ను ఎన్నికల సమయానికి సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
3. రమేష్ చెన్నితల: అనుభవజ్ఞుడు
కేరళ కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడైన రమేష్ చెన్నితల ఈసారి ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా రికార్డు సృష్టించారు. గతంలో హోం మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. సీడబ్ల్యూసీ (CWC) సభ్యుడిగా జాతీయ స్థాయిలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
4. కేసీ వేణుగోపాల్: హైకమాండ్ నమ్మకస్తుడు
రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడైన కేసీ వేణుగోపాల్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన, పార్టీ వ్యవస్థాగత నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పంపాలని హైకమాండ్ భావిస్తే, ఆయన అభ్యర్థిత్వం ఖాయమయ్యే అవకాశం ఉంది. పార్టీ వ్యూహకర్తగా ఆయనకు మంచి పేరుంది. అయితే జాతీయ స్థాయిలో పేరున్న కేసీ వేణుగోపాల్ దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలకు ఇన్‌చార్జ్‌గా చేసిన అనుభవం కూడా ఉంది. మరోవైపు జాతీయ రాజకీయాల్లో ఆయన అనుభవం, అవసరం పార్టీకి ఉంది. అలాంటి సమయంలో ఆయనను ఒక రాష్ర్టానికే పరిమితం చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. రాహుల్ గాంధీ తర్వాత అంతటి గుర్తింపు ఉన్న నేతగానే కాకుండా, గాంధీ కుటుంబం తర్వాత కేసీ వేణుగోపాల్ కు పార్టీలో అంతటి గుర్తింపు ఉంది. అలాంటి నేతను పార్టీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
5. శశి థరూర్: గ్లోబల్ ఇమేజ్
తిరువనంతపురం ఎంపీగా ఉన్న శశి థరూర్ పేరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చర్చకు వస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో దౌత్యవేత్తగా పేరున్న థరూర్, యువతలో ,విద్యావంతులలో అమితమైన ప్రజాదరణ కలిగి ఉన్నారు. 2009 నుండి ఎంపీగా ఉన్న ఆయన, పార్టీలోని అభ్యుదయ వాణిగా గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితిలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన అనుభవం కేరళ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. శశి థరూర్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నప్పటికీ ఆయనకున్న కన్నింగ్ మెంటాల్టీ పార్టీకి నష్టం చేస్తుందనే వాదన ఉంది. గతంలో బీజేపీకి బద్ధ వ్యతిరేకిగా ముద్రపడ్డ ఆయన ప్రస్తుతం అనుకూలంగా మారారనే అపవాదు కూడా ఉంది. దీంతో ఆయన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి పదవిపై శశి థరూర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణీత ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధిష్టానం ప్రతినిధి నూతన ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరిస్తారని, ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం యూడీఎఫ్ ఆధిక్యంలో ఉండటంతో, ఈ ఐదుగురు నేతల్లో అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందో అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Follow Us