/rtv/media/media_files/2026/06/04/fire-accident-2026-06-04-10-21-17.jpg)
Fire accident
Fire accident : దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ఘోర అగ్నిప్రమాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపాయి. ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్‌రానీ ప్రాంతంలో ఉన్న 'ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్' హోటల్‌లో బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ వెలిగించిన తరుణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి హోటల్ అంతటా వేగంగా వ్యాపించాయి. ఈ భయంకర దుర్ఘటనలో ఏకంగా 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి 58 మందిని సురక్షితంగా కాపాడారు. గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది.
ఈ ఢిల్లీ హోటల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 10 మంది భారతీయులు కాగా, మిగిలిన వారిలో తొమ్మిది మంది ఆఫ్రికా దేశస్తులు, ఇద్దరు తుర్క్‌మెనిస్థాన్‌కు చెందిన విదేశీయులు ఉన్నారు. వీరంతా వైద్య చికిత్సల కోసం స్థానికంగా వచ్చి ఈ హోటల్‌లో బస చేశారు. అయితే, ఆ హోటల్ భవనానికి బయటకు వెళ్లేందుకు కేవలం ఒకే ఒక మార్గం (ఎగ్జిట్) ఉండటంతో బాధితులు తప్పించుకోలేక భారీగా ప్రాణనష్టం సంభవించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు కిటికీల గుండా, భవనం పైనుంచి కిందకు దూకారు. ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుండి దూకగా, స్థానికులు కింద పరుపులు పరచడంతో ఆమె తృటిలో ప్రాణాలతో బయటపడింది.
ఢిల్లీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది భారతీయులు మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది. స్థానిక సాకేత్ మాక్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న వృద్ధుడు రాధే శ్యాం అగర్వాల్(70)ను చూడటానికి ఆయన కుమారుడు వివేక్ అగర్వాల్ (40) తన తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు , బంధువులతో కలిసి బెంగళూరు నుండి వచ్చి ఈ హోటల్‌లో బస చేశారు. తండ్రి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా, ఇటు హోటల్‌లో చెలరేగిన అగ్నికీలల్లో కొడుకు కుటుంబం మొత్తం సజీవ దహనమవ్వడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా 6 గదుల అనుమతితో 25 గదులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. పరారీలో ఉన్న భవన యజమాని లవకేశ్ బజాజ్, ఆయన భార్యపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ ఘోర ప్రమాదం మరవక ముందే, గురువారం తెల్లవారుజామున 3.55 గంటల ప్రాంతంలో బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలో మరో పెను ప్రమాదం సంభవించింది. స్థానిక ప్రసాద్ ఆసుపత్రిలోని ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ (ICU) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూ, సీసీయూ విభాగాలలో సుమారు 20 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ యూనిట్, మానిటర్ సిస్టమ్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తేల్చారు.
ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ భవనాన్ని కమ్మేయడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర గందరగోళానికి, భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి రామ్ నివాస్ పాండే నేతృత్వంలోని రెస్క్యూ సిబ్బంది, పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కిటికీలు పగులగొట్టి దట్టమైన పొగను బయటకు పంపుతూ, లోపల చిక్కుకుపోయిన 15 నుండి 20 మంది రోగులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, దురదృష్టవశాత్తూ ఇద్దరు రోగులు ఘటనా స్థలంలోనే శ్వాస ఆడక మరణించగా, మరో వ్యక్తి సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
ఈ ఆసుపత్రి ప్రమాదంపై ముజఫర్‌పుర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ స్పందిస్తూ, ప్రమాద సమయంలో ఐసీయూలో 13 మంది ఉన్నారని, సహాయక చర్యలు పూర్తయ్యాయని తెలిపారు. గాయపడిన కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేశంలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇరుకైన మార్గాలతో నడుస్తున్న హోటళ్లు, ఆసుపత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Follow Us