/rtv/media/media_files/2026/05/27/center-issues-rfp-for-amca-development-2026-05-27-21-09-03.jpg)
Center Issues RFP For AMCA Development
Fighter Jets : భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశీయంగా అత్యాధునిక యుద్ధ విమానాల (Fighter Jets) అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళ బలాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అత్యాధునిక మధ్యశ్రేణి కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA - Advanced Medium Combat Aircraft) ప్రాజెక్టులో భాగస్వాములు కావాల్సిందిగా తొలిసారిగా ప్రైవేటు రంగానికి పిలుపునిచ్చింది.ఈ 5వ తరం (5th Generation) స్టీల్త్ ఫైటర్ జెట్ అభివృద్ధి కోసం ప్రైవేటు రక్షణ రంగ సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరుతూ కేంద్రం అధికారికంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) ప్రకటనను విడుదల చేసింది. రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన (ఆత్మనిర్భరత) సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రేసులో నిలిచిన టాప్ దేశీయ సంస్థలు
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) గత 2025లోనే ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను విడుదల చేశాయి. ఇందుకు దేశీయ రక్షణ రంగం నుంచి 7 ప్రముఖ సంస్థలు స్పందించగా.. వాటిలో వడపోత అనంతరం మూడు ప్రధాన కన్సార్షియంలను (కూటములను) మలిదశకు కేంద్రం ఎంపిక చేసింది. వాటిలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (Tata Advanced Systems), ఎల్‌అండ్‌టీ - బీఈఎల్ - డైనమాటిక్ కన్సార్షియం (L&T, BEL, Dynamatic), భారత్ ఫోర్జ్ - బీఈఎమ్ఎల్ - డాటా పాటర్న్స్ కన్సార్షియం (Bharat Forge, BEML, Data Patterns) లు ఉన్నాయి.ఈ మూడు సంస్థలు తమ తుది బిడ్‌లను (Proposals) సమర్పించేందుకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రాజెక్టును దక్కించుకునే ప్రైవేటు భాగస్వామి ఎవరనేది అధికారికంగా ఖరారు కానుంది.
రూ. 15,000 కోట్ల ప్రాజెక్టు.. పూర్తి నిధులు కేంద్రానివే
రక్షణ రంగ చరిత్రలోనే అతిపెద్ద ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుగా నిలవనున్న ఈ ఏఎమ్‌సీఏ (AMCA) డెవలప్‌మెంట్ విలువ రూ. 15,000 కోట్లుగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో భరిస్తుంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేటు సంస్థ.. ఏఎమ్‌సీఏ యుద్ధ విమానానికి సంబంధించిన ఐదు ప్రొటోటైప్ (నమూనా) మోడల్స్‌ను, అలాగే ఒక ప్రయోగాత్మక (Experimental) ఫైటర్ జెట్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకునే ప్రైవేటు సంస్థ స్వతంత్రంగా కాకుండా, ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థలైన ఏడీఏ (ADA), డీఆర్‌డీఓ (DRDO)లతో సంయుక్తంగా కలిసి పనిచేస్తూ ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే తయారీ, టెస్టింగ్ హబ్
ఈ 5వ తరం ఫైటర్ జెట్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. ఏపీలోని పుట్టపర్తిలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాటవుతున్న 'ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్' (Aircraft Integration and Flight Testing Complex) లో ఈ ఏఎమ్‌సీఏ యుద్ధ విమానాల తయారీ, సాంకేతిక అనుసంధానం,కీలకమైన విమాన పరీక్షలను చేపట్టనున్నారు.యుద్ధ విమానాల తయారీ రంగంలో ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) మాత్రమే ఏకఛత్రాధిపత్యం వహించగా.. ఇప్పుడు ప్రైవేటు రంగానికి కూడా ఈ అవకాశం కల్పించడం ద్వారా ప్రాజెక్టుల వేగం పెరగడమే కాకుండా, అంతర్జాతీయ రక్షణ మార్కెట్‌లో భారతదేశం ఒక మేజర్ హబ్‌గా మారడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడనుంది.
Follow Us