Miss India 2026 : మిస్ ఇండియా 2026 విజేతగా సాధ్వి సతీష్ సైల్

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ విజేతగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో పలువురు అందగత్తెలను వెనక్కి నెట్టి సాధ్వి 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

New Update
FotoJet - 2026-04-20T081026.531

miss india 2026

Miss India 2026 : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని KIIT వేదికగా జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ విశ్వవిజేతగా నిలిచారు. రజనీగంధ పెర్ల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలో దేశవ్యాప్తంగా వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి, సాధ్వి 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే పోటీలో మహారాష్ట్రకు చెందిన రజనందిని పవార్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ శ్రీ అద్వైత సెకండ్ రన్నరప్‌గా నిలిచి మెప్పించారు.

Sadhvi Satish Sail Won Femina Miss India World 2026 Title Photos (2)

సేవా దృక్పథం కలిగిన అందాల రాణి

సాధ్వి సతీష్ సైల్ కేవలం మోడలింగ్‌కే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, పోషకాహార లోపంపై ఆమె నిరంతరం పోరాడుతున్నారు. వినికిడి ,మాటల లోపం ఉన్న చిన్నారులకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమం కోసం నిధుల సేకరణ వంటి అర్థవంతమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన ఫిట్‌నెస్ అప్‌డేట్‌లు , వృత్తిపరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు.

Sadhvi Satish Sail Won Femina Miss India World 2026 Title Photos (3)

వేదికపై మెరిసిన అద్భుత రూపం

ఫైనల్ పోటీల్లో సాధ్వి ధరించిన దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. డిజైనర్ లేబుల్ 'వాజనే' రూపొందించిన వెండి రంగు మెటాలిక్ పూసల పనితనం గల హాల్టర్-నెక్ గౌనులో ఆమె దేవకన్యలా మెరిసిపోయారు. ఈ వేడుక కోసం ఆమె ఎంచుకున్న సాధారణ కేశాలంకరణ , ఆకర్షణీయమైన చెవిపోగులు ఆమె లుక్‌ను మరింత హుందాగా మార్చాయి. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయ వేదికపై 'మిస్ వరల్డ్' పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

Sadhvi Satish Sail Won Femina Miss India World 2026 Title Photos (5)

సవాళ్లను జయించిన ఆత్మవిశ్వాసం

తన ప్రయాణం గురించి సాధ్వి మాట్లాడుతూ.. ఒక సామాన్య పట్టణం నుండి వచ్చి ప్రపంచ వేదికపై నిలబడటం వెనుక ఎన్నో అంతర్మథనాలు ఉన్నాయని తెలిపారు. మొదట్లో ఇతరుల విజయాలను చూసి తనపై తనకు సందేహాలు కలిగేవని, కానీ ఇతరులతో పోల్చుకోవడం మానేసి మనస్ఫూర్తిగా వారిని అభినందించడం నేర్చుకున్నాక తనలో భయం పోయిందని పేర్కొన్నారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే కేవలం అందాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదని, పట్టుదల ,దృఢ సంకల్పంతో సవాళ్లను ఎదుర్కోవడమేనని ఆమె ఆత్మవిశ్వాసంతో చాటిచెప్పారు.

Sadhvi Satish Sail Won Femina Miss India World 2026 Title Photos (10)

Advertisment
తాజా కథనాలు