Rising prices :పెరగనున్న నిత్యావసరాల ధరలు...సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు!

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్‌ వ్యయాలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయంగా నిత్యావసర సరుకులు తయారు చేసే ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ (FMCG) కంపెనీలు సామాన్యుడికి మరోసారి ‘ధరల షాక్’ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

New Update
FotoJet - 2026-05-11T132423.005

daily essentials

Rising prices : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్‌ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా నిత్యావసర సరుకులు తయారు చేసే ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ (FMCG) కంపెనీలు సామాన్యుడికి మరోసారి ‘ధరల షాక్’ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

పశ్చిమాసియా సంక్షోభం సెగ సామాన్యుడి వంటగదికి తగలనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత, నౌకాయాన రవాణా ఖర్చులు (ఫ్రైట్ ఛార్జీలు) పెరగడం, ప్యాకేజింగ్ ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని తాకడంతో దేశీయ ఎఫ్‌ఎంసీజీ (త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను మరో విడత పెంచేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే వివిధ శ్రేణి ఉత్పత్తులపై 3 నుంచి 5 శాతం వరకు ధరలు పెంచిన దిగ్గజ సంస్థలు.. తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు మరోసారి ధరల సవరణ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల నిత్యం మనం వాడే సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, పానీయాలు, కేశ నూనెల ధరలు మరింత ప్రియం కానున్నాయి.
 
తమపై పడుతున్న అదనపు వ్యయ భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు ప్రధానంగా రెండు మార్గాలను ఎంచుకుంటున్నాయి. అంటే నేరుగా ధరలను పెంచడం అంటే సాధారణ ప్యాకెట్లపై ధరలను పెంచడం. లేదా పరిమాణాన్ని తగ్గించడం (గ్రామేజ్ అడ్జస్ట్‌మెంట్): రూ.5, రూ.10 వంటి తక్కువ ధరల ప్యాకెట్ల ధరను అలాగే ఉంచి, వాటిలోని వస్తువు బరువును (పరిమాణాన్ని) తగ్గించడం

 ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాల నిర్ణయాలు

పశ్చిమాసియా సంక్షోభం సృష్టించిన వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఉత్పత్తి వ్యయం దాదాపు 10 శాతం మేర పెరిగిందని డాబర్ ఇండియా వెల్లడించింది. దీనిని అధిగమించడానికి కంపెనీ ఇప్పటికే వివిధ విభాగాల ఉత్పత్తులపై సుమారు 4 శాతం ధరలను పెంచినట్లు తెలిపింది. మరోవైపు ఇంధన, ప్యాకేజింగ్ ఖర్చులు దాదాపు 20 శాతం వరకు పెరగడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ధరల పెంపు లేదా ప్యాక్ పరిమాణాన్ని తగ్గించే యోచనలో ఉంది. ముఖ్యంగా రూ.10 కంటే ఎక్కువ ధర కలిగిన ప్యాకెట్ల ధరలను పెంచాలని ఈ సంస్థ భావిస్తోంది.

మార్కెట్లో ముడిసరుకు వ్యయాలు 8-10 శాతం పెరిగినట్లు దేశీయ అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) స్పష్టం చేసింది. పరిస్థితులను తట్టుకునేందుకు ఇప్పటికే 2 నుంచి 5 శాతం వరకు ధరలు పెంచామని, ముడిసరుకుల ధరలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరోసారి ధరల సవరణ తప్పదని హెచ్‌యూఎల్‌ పేర్కొంది. ఇక ముడి చమురు ఆధారిత ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో మారికో సంస్థ సైతం తమ హెయిర్ ఆయిల్ పోర్ట్‌ఫోలియోపై ఇప్పటికే 6 నుంచి 7 శాతం వరకు ధరలను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితి వల్ల వచ్చే కొన్ని నెలల పాటు మార్కెట్ పరిస్థితులను అంచనా వేయడం కష్టంగా మారిందని నెస్లే ఇండియా అభిప్రాయపడింది.

ఫెవికాల్‌ కొనడం కూడా కష్టమే

కేవలం నిత్యావసరాలే కాకుండా ఇళ్లు, నిర్మాణ రంగానికి అవసరమైన అధెసివ్స్, కెమికల్స్ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రముఖ అధెసివ్స్ బ్రాండ్లు అయిన ఫెవికాల్ (Fevicol), డాక్టర్ ఫిక్సిట్ (Dr. Fixit), ఫెవిక్విక్ (FeviKwik), ఎం-సీల్ (M-Seal) తయారు చేసే ప్రముఖ సంస్థ పిడిలైట్ ఇండస్ట్రీస్ (Pidilite Industries) కూడా ధరల పెంపునకు సిద్ధమైంది.

  ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న వినైల్ ఎసిటేట్ మోనోమర్ (VAM) వంటి కీలక ముడిసరుకుల సగటు ధరలు ఏకంగా 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. పిడిలైట్ సంస్థ ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండు విడతలుగా ధరలను పెంచింది (ఫెవికాల్ ధరలను దాదాపు 12-15% పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి). ముడిసరుకు భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయడం మినహా మరో మార్గం లేదని, అందువల్ల త్వరలోనే మరో విడత ధరల పెంపు ఉంటుందని కంపెనీ యాజమాన్యం సంకేతాలిచ్చింది.

 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగి, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు (Supply Chains) పుంజుకునే వరకు ఈ ద్రవ్యోల్బణ ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది మధ్యతరగతి, సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

Advertisment
తాజా కథనాలు