/rtv/media/media_files/2026/06/08/delhi-2026-06-08-16-43-19.jpg)
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/31/ravi-prakash-2026-05-31-20-05-28.webp)
-Ravi Prakash
ఈ కథనం చూసి...ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడూ, రెక్కాడితే గానీ డొక్కాడకపోయినా, ప్రతి వస్తువుకూ ట్యాక్స్ కడుతున్న ప్రతి సామాన్యుడూ...ప్రభుత్వాన్ని, వ్యవస్థలను ప్రశ్నించాలి. ఎందుకంటే..? దేశ రాజధాని ఢిల్లీలో...21 మంది సజీవ దహనమయ్యారు! అవును... మీరు వింటున్నది నిజం! నిప్పుల కొలిమిలో 21మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! ఇది ప్రమాదమా?, వ్యవస్థ చేసిన హత్యా?, నిబంధనలను తుంగలో తొక్కిన పాలకుల నిర్లక్ష్యమా?
ఎవరైనా వచ్చి, ఏ అధికారి అయినా ప్రెస్ మీట్ పెట్టి..."అయ్యో, ఇది దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం" అని నీతులు చెబితే...అది నిర్లక్ష్యం కారణంగా బలైపోయిన అమాయకులను అవమానించడమే! ప్రమాదం అంటే ఊహించకుండా జరిగేది. కానీ ఢిల్లీలో జరిగింది ముందే ఊహించిన డిజాస్టర్! కళ్ళుండీ చూడలేని గుడ్డి వ్యవస్థ చేసిన నిర్వాకం ఇది, అవినీతి తిమింగలాలు చేసిన పక్కా ప్లాన్డ్ మర్డర్ ఇది!
అసలు ఈ దేశంలో కామన్ మ్యాన్ ప్రాణానికి ఉన్న విలువ ఎంత?, చెప్పండి... ఎంత ఖరీదు కడతారు? ఎందుకంటే... మన వ్యవస్థ నడుస్తున్న తీరు చూస్తుంటే, సామాన్యుడు ఎక్కడైనా చావొచ్చు, ఎలాగైనా చావొచ్చు...కానీ అడిగే నాథుడే లేడు! నువ్వు ఫ్లైఓవర్ పైపోతుంటే అది కూలి చావొచ్చు! రైలెక్కితే పట్టాలు తప్పి చావొచ్చు! ఆసుపత్రికి వెళ్తే ఆక్సిజన్ అందక చావొచ్చు! కోచింగ్ సెంటర్‌కు వెళ్తే బేస్‌మెంట్‌లో నీళ్లు మునిగి చావొచ్చు! ఒక బిల్డింగ్‌లోకి వెళ్తే రూల్స్ లేని కట్టడం పైనుంచి పడి చావొచ్చు! ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పటిలాగే అదే సీన్... అదే స్క్రిప్ట్! ఒక సంతాప సందేశం... ఒక ఎక్స్‌గ్రేషియా చెక్కు...ఒక ప్రెస్ కాన్ఫరెన్స్... ఒక విచారణ కమిటీ... నాలుగు రోజులు మీడియాలో హెడ్‌లైన్స్...ఆ తర్వాత అంతా క్లోజ్! దేశం తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఒక్కసారి గమనించారా?, ఈ ఘోరాల్లో ఎప్పుడైనా వివిఐపిలు, పవర్‌ఫుల్ లీడర్లు చనిపోయారా? లేదు! చనిపోయేది ఎప్పుడూ మిడిల్ క్లాస్...లోయర్ మిడిల్ క్లాస్...రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, అమాయక జనం!
మాకు సానుభూతి వద్దు
టుడే ఐ వాంట్ ఆన్సర్స్! ఇవాళ మాకు సానుభూతి వద్దు... రాజకీయ ట్వీట్లు వద్దు...ఫోటో షూట్లు అస్సలు వద్దు. సమాధానం మాత్రమే కావాలి...ఈ 21 మందిని చంపిన హంతకుడు ఎవరు? ఇక, అసలు స్టోరీలోకి వస్తున్నా...ఇది ఏదో ఒక మారుమూల ప్రాంతంలోనో, ఏ అడవిలోనో జరిగిన దందా కాదు. దేశ రాజధాని నడిబొడ్డున...ప్రభుత్వ కార్యాలయాలు ముందు ఉండే భవనంలో జరిగిన ఘోరం. అసలు రిపోర్టులు ఏం చెబుతున్నాయి? కేవలం 6 గదుల బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ కోసంతీసుకున్న ఒక లైసెన్స్.... ఏకంగా 26 గదుల హోటల్‌గా ఎలా మారిపోయింది? దట్స్ మై క్వశ్చన్! హౌ? ఎలా సాధ్యం? ఒక్క రూమ్ కాదు, రెండు రూములు కాదు...ఏకంగా ఇరవై ఆరు గదులు! ఆరు గదుల బిల్డింగ్ ఉన్నపళంగా 26 గదులు అయిపోదు కదా? దానికి నిర్మాణం కావాలి... సమయం పడుతుంది... కస్టమర్లు రావాలి... బిజినెస్ జరగాలి...ఇదంతా జరుగుతుంటే ఢిల్లీ మున్సిపల్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? కళ్ళకు గంతలు కట్టుకున్నారా? లేక నోట్ల కట్టల మత్తులో జోగుతున్నారా?
ఒక సామాన్యుడు ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇంటికొచ్చే వ్యవస్థ...ఐటీ రిటర్న్స్‌లో ఒక్క రూపాయి అటూ ఇటూ అయితే నోటీసులు ఇచ్చే అధికారులు...ఇంత పెద్ద భవనానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోయినా, ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకపోయినా ఎందుకు గుడ్లు అప్పగించి చూశారు? సామాన్యుడిపై ప్రతాపం చూపే వ్యవస్థకు, ఇలాంటి పెద్ద తలకాయల ఉల్లంఘనలు కనిపించవా..? కొన్నిగంటల నుంచి ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ విజువల్స్ చూస్తూనే ఉన్నాం...ప్రాణాలు కాపాడుకోవడానికి జనం కిటికీల నుంచి దూకుతుంటే...వెనుక మంటలు, కింద కాంక్రీట్ రోడ్డు! అక్కడ కాపాడింది ప్రభుత్వ యంత్రాంగం కాదు, రోడ్డు పక్కన పరుపులు పరిచిన సామాన్య ప్రజలు! సిగ్గుచేటు! వ్యవస్థకు అంతకంటే పరాభవం ఇంకొకటి ఉంటుందా? మన లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఒక సామాన్యుడి పరుపా?
సరిగ్గా 5 నెలల క్రితం ఇదే ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేయండి, సర్టిఫికేట్లు చెక్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చింది. కోర్టు అంతలా హెచ్చరించినా, ఆదేశాలు సైతం జారీచేసినా ఎందుకు అమలు కాలేదు? ఎందుకంటే ఇక్కడ కమిటీలు ఉంటాయి...ఆర్డర్లు ఉంటాయి... కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం శూన్యం!
ఇప్పుడు నన్ను మరింత బాధించే నిజం ఒకటి షేర్ చేసుకోవాలి...ఢిల్లీకి ఇవేమీ కొత్తకాదు, ఇది మొదటి అగ్నిప్రమాదం కాదు...దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ప్రమాదాలు సిగ్గుచేటు సంప్రదాయంగా మారిపోయాయి. ప్రమాదం జరగడం... బాధిత కుటుంబాలు కొన్నాళ్లు ఏడవడం...ఆ తర్వాత నేతలు హామీలు ఇవ్వడం... క్రమంగా ఆ ఇష్యూ మెల్లగా కాలగర్భంలో కలిసిపోవడం..! ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం...ఉప్హార్ సినిమా... 59మంది అమాయకులు థియేటర్ లోపల లాక్ అయిపోయి చనిపోయారు. అప్పుడు దేశమంతా షాక్ అయింది. ఇకపై ఇలా జరగనివ్వం' అన్నారు.ఇక, అనాజ్ మండి.. 40 మందికి పైగా కార్మికులు ఇరుకైన గల్లీల్లోని ఫ్యాక్టరీలో కాలి బూడిదయ్యారు. మళ్లీ అదే డైలాగులు... సేఫ్టీ ఆడిట్ అన్నారు. ముండ్కా ఇన్సిడెంట్...27 మంది కమర్షియల్ బిల్డింగ్‌లో చనిపోయారు, మళ్లీ దర్యాప్తు అన్నారు,కఠిన చర్యలు అన్నారు. గతం నుంచి ఇన్ని పాఠాలు నేర్చుకుంటే, ఇవాళ 21 మంది ఎందుకు శవాలయ్యారు? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే...
దిల్లీకి ఫైర్ ప్రాబ్లం లేదు, 'మెమరీ ప్రాబ్లం' ఉంది! ఇక్కడ ప్రతి విషాదం కేవలం తదుపరి న్యూస్ సైకిల్ వచ్చే వరకే గుర్తుంటుంది. కొత్త బ్రేకింగ్ న్యూస్ రాగానే పాత శవాల వాసన మర్చిపోతారు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడూ శ్మశాన యాత్ర ముగిశాకే ఎందుకు మొదలవుతుంది? ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎప్పుడూ ప్రాణాలు పోయాకే ఎందుకు గుర్తొస్తుంది?. ఐదర్ నోబడీ నోస్ ... లేదా ఎవ్రీబడీ నోస్ అండ్ నోబడీ యాక్టెడ్. ఈ రెండింటిలో ఏది నిజమైనా అది పౌరుల పాలిట మరణశాసనమే!
భారతదేశంలో ఒక అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్ ఉంది. 21 మంది చనిపోతారు... కానీ ఎవ్వడూ తప్పు చేయడు! ఎవ్వరికీ బాధ్యత ఉండదు! బాధ్యతను గాల్లోకి ఎలా పంపేయాలో మన వ్యవస్థకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో...బిల్డింగ్ ఓనర్ అంటాడు- "నేను అన్ని రూల్స్ ఫాలో అయ్యాను"...ఒక డిపార్ట్‌మెంట్ అంటుంది- "మా పరిధిలోకి రాదని..మరో డిపార్ట్‌మెంట్ అంటుంది- "ఆ పర్మిషన్ వేరేవాళ్లు ఇచ్చారని..పాత ప్రభుత్వంపై కొత్తవాళ్లు...కొత్తవాళ్లపై పాతవాళ్లు... ఒకరిపై ఒకరు ఫైళ్లు విసురుకుంటూ చివరికి బాధ్యత అనేదాన్ని బూడిదలో కలిపేశారు.
బాధితుల పక్షాన నేను అడిగేది ఒక్కటే... నాకు థియరీలు వద్దు. ఒకే ఒక్క హోదా... ఒకే ఒక్క ఆఫీస్... ఒకే ఒక్క పేరు చెప్పండి. ఆ 6 గదుల హోటల్ 26 గదులు అవుతుంటే ఆపాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత అనేది ఎప్పుడూ కింద స్థాయికి ప్రవహిస్తుంది తప్ప,పైనున్న అధికారి పీఠం కదలదు. సామాన్య పౌరుడు, ట్యాక్స్ పేయర్, చిన్న వ్యాపారి మాత్రమే ఇక్కడ బాధ్యత వహించాలి...రూల్స్ ఎన్‌ఫోర్స్ చేయాల్సిన పెద్ద తలకాయలకు మాత్రం ఎలాంటి శిక్షలు ఉండవు. నిజం మాట్లాడుకుందాం... నిన్న గనుక ఆ బిల్డింగ్‌లో మంటలు రాకపోతే, ఇవాళ కూడా అక్కడ బిజినెస్ హ్యాపీగా నడిచేది...కస్టమర్లు వచ్చేవారు... డబ్బులు టేబుల్ కింద నుంచి పైకి వెళ్లేవి. అంటే మన వ్యవస్థ ప్రమాదాలను ఆపడం లేదు...ప్రమాదం ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తోంది!
చివరగా... నన్ను అన్నిటికంటే ఎక్కువగా భయపెడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆ మంటలు కాదు... ఆ 21 నంబర్ కానే కాదు..మనలో చచ్చిపోయిన స్పందన! మనం దేన్నీ చూసి షాక్ అవ్వకపోవడం! వార్త రాగానే మనకు ముందే స్క్రిప్ట్ తెలిసిపోతుంది. జనం చనిపోతారు... లీడర్లు వస్తారు... పరిహారం ప్రకటిస్తారు...మళ్లీ అంతా మామూలే అని మనం కూడా డిసైడ్ అయిపోయాం. ఫెయిల్యూర్ ని మనం నార్మలైజ్ చేసేశాం!
కానీ ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి...ఆ చనిపోయిన 21 మందిలో మీ నాన్నో, మీ అమ్మో, మీ భార్యో, మీ భర్తో... లేదా, మీ పిల్లలో ఉండి ఉంటే... ఇవాళ మీరు ఇలాగే ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చునేవారా? ఇది టీవీ డిబేట్ కాదు... ఒకరి ఇంట్లో ఆరిపోయిన దీపం. మీడియా కెమెరాలు వెళ్ళిపోతాయి... పొలిటీషియన్ల ట్వీట్లు ఆగిపోతాయి...సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ వస్తుంది...కానీ ఆ కుటుంబాల గుండెల్లో మంట ఎప్పటికీ ఆరదు.
ప్రభుత్వాల పని జనం చనిపోయాక శవాలకు రేటు కట్టి చెక్కులు ఇవ్వడం కాదు... అసలు జనం చావకుండా చూడటం! ఇక చాలు! సామాన్యుడి రక్తాన్ని ఇంత చీప్‌గా చూడటం ఆపండి. మనం క్వశ్చన్ రైజ్ చేయనంత కాలం, తప్పు చేసిన అధికారిని నడిరోడ్డుపై నిలబెట్టనంత కాలం...ఈ అగ్నిప్రమాదం చివరిది కాదు... కేవలం ఒక ఫ్రెష్ న్యూస్ మాత్రమే!
Follow Us