/rtv/media/media_files/2026/05/04/vijay-bjp-2026-05-04-11-23-04.jpg)
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదవుతోంది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు తళపతి విజయ్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. కేవలం రెండేళ్ల క్రితం (2024లో) స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) నేడు అధికారం దిశగా దూసుకుపోతుండటం భారత రాజకీయాల్లోనే ఒక అద్భుతంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. గత యాభై ఏళ్లుగా డీఎంకే మరియు ఏఐఏడీఎంకేల మధ్యే సాగుతున్న అధికార మార్పిడికి చెక్ పెడుతూ, విజయ్ నేతృత్వంలోని టీవీకే మ్యాజిక్ ఫిగర్ వైపు అడుగులు వేస్తోంది. చాలా కాలంగా తమిళ ప్రజలు ఈ రెండు ప్రధాన పార్టీల పాలనతో విసిగిపోయారు. అవినీతి ఆరోపణలు, కుటుంబ రాజకీయం, పాత పద్ధతులపై అసంతృప్తితో ఉన్న ప్రజలు ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూశారు. సరిగ్గా అదే సమయంలో విజయ్ రాజకీయ ప్రవేశం ఆ ఆశలకు ఊపిరి పోసింది.
రాజకీయాల్లోకి వస్తారంటూ
తమిళనాట గత పదేళ్లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అభిమానులు ఆయన కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. కానీ, ఆరోగ్య కారణాలు,ఇతర సమీకరణాల దృష్ట్యా రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. రజనీకాంత్ వదిలేసిన ఆ ఖాళీని విజయ్ అత్యంత చాకచక్యంగా వాడుకున్నారు. రజనీకాంత్ వెనకడుగు వేసినా, విజయ్ మాత్రం వెనక్కి తగ్గకుండా తనకున్న గ్లామర్‌ను, అభిమాన సంఘాల బలాన్ని ఒక రాజకీయ శక్తిగా (TVK) మార్చడంలో సక్సెస్ అయ్యారు.
2024 ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించిన విజయ్, అప్పటి నుంచి విరామం లేకుండా ప్రజల్లోనే ఉన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగి, డీఎంకే కంచుకోటల్లో సైతం ఆధిక్యం సాధించడం ఆయన తెగువకు నిదర్శనం. యువతలో ఉన్న క్రేజ్‌ను కేవలం సినిమా వసూళ్లకే పరిమితం చేయకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు బ్యాంకుగా మార్చగలిగారు. ఇది కేవలం ఒక పార్టీ విజయం మాత్రమే కాదు, మార్పు కోరుకున్న కోట్లాది తమిళుల విజయం.
Follow Us