Praggnanandhaa : టేబుల్‌ పైనే చెస్..  సెకన్లలోనే సీఎం విజయ్ ను ఓడించిన ప్రజ్ఞానంద!

చెన్నై వేదికగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం  విజయ్ ప్రత్యేకంగా అభినందించారు.

New Update
cm vijay

చెన్నై వేదికగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం  విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. సచివాలయంలో జరిగిన ఈ అధికారిక సమావేశంలో ప్రజ్ఞానందకు రూ.  50 లక్షల రూపాయలను  అందజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన ఒక సరదా చెస్ మ్యాచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. 

సీఎం టేబుల్‌పైనే వీరిద్దరి మధ్య ఒక చిన్న చెస్ మ్యాచ్ జరిగింది. అసలు సీఎం విజయ్ కు  చెస్ ఆడటం వచ్చు అనే విషయం తనకు ముందే తెలియదని, తనను చెస్ బోర్డు తీసుకురమ్మని అడిగినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ప్రజ్ఞానంద చెప్పుకొచ్చాడు. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే, కేవలం కొన్ని ఎత్తుల్లోనే ప్రజ్ఞానంద సీఎం విజయ్‌ను చెక్‌మేట్ చేసి ఈ మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద సీఎం ఆటతీరును ఎంతగానో ప్రశంసించాడు. విజయ్ గారు చాలా బాగా ఆడారని, తను కాలేజీ రోజుల్లో తన స్నేహితులతో కలిసి చెస్ ఆడేవాడినని సీఎం తనకు చెప్పారని ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశాడు. ఈ అనుభవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని, సీఎం చేతుల మీదుగా నగదు బహుమతి అందుకోవడం చాలా స్ఫూర్తినిచ్చిందని అన్నాడు.

విన్సెంట్ కీమర్‌ను ఓడించి

ఓస్లోలో జరిగిన నార్వే చెస్ 2026 ఫైనల్ రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి ప్రజ్ఞానంద ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో నార్వే చెస్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఆఖరి దశలో వరుసగా నాలుగు క్లాసికల్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, తన కెరీర్‌లోనే అతిపెద్ద టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, అలీరెజా ఫిరౌజ్జా, వెస్లీ సో, విన్సెంట్ కీమర్ వంటి ప్రపంచ దిగ్గజాలు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో చెన్నైకి చెందిన ఈ 20 ఏళ్ల యువకుడు అందరికంటే ముందు నిలిచాడు. ముఖ్యంగా ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఈ ఒకే టోర్నమెంట్‌లో రెండుసార్లు ఓడించి ప్రజ్ఞానంద సరికొత్త సంచలనం సృష్టించాడు. 

Advertisment
తాజా కథనాలు