West Bengal Election 2026 : పశ్చిమ బెంగాల్‌లో రసవత్తరంగా పోలింగ్...మమత. సువేందు అధికారి పోటాపోటీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది. మొత్తం 294 నియోజకవర్గాలున్న బెంగాల్‌లో ఇప్పటికే ఏప్రిల్ 23న మొదటి విడతగా 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, బుధవారం రెండో ,చివరి విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది.

New Update
FotoJet - 2026-04-29T105036.452

West Bengal Election 2026

West Bengal Election 2026 : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం క్లైమాక్స్ దశకు చేరుకుంది. మొత్తం 294 నియోజకవర్గాలున్న బెంగాల్‌లో ఇప్పటికే ఏప్రిల్ 23న మొదటి విడతగా 152 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, బుధవారం రెండో ,చివరి విడతలో భాగంగా మిగిలిన 142 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. కోల్‌కతా, హావ్​డా, హుగ్లీ, ముర్షీదాబాద్, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాల వంటి అత్యంత కీలకమైన జిల్లాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. ఈ దఫాలో దాదాపు 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది, ఇక్కడ ఆమెపై బీజేపీ తరపున సువేందు అధికారి బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా మారింది.

ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ ప్రారంభానికి ముందే నదియా జిల్లాలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి జరగడం, కార్యకర్తలకు గాయాలవ్వడం వంటి ఘటనలు కలకలం రేపాయి. క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొదటి విడతలో రికార్డు స్థాయిలో 93.19 శాతం ఓటింగ్ నమోదు కావడంతో, ఈ రెండో విడతలో కూడా అదే స్థాయి ఉత్సాహం కనిపిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల సంఘం సుమారు 41 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘాను ఏర్పాటు చేసింది.

హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఈసీ అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించగా, ఒక్క కోల్‌కతాలోనే అత్యధికంగా 273 కంపెనీలను రంగంలోకి దించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచడమే కాకుండా, 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాంబు దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా రంగంలోకి దిగింది. ఇటీవల దక్షిణ పరగణాల జిల్లాలో నాటు బాంబులు లభించిన నేపథ్యంలో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు చేస్తోంది.

రాజకీయంగా ఈ 142 స్థానాలు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ,ప్రతిపక్ష బీజేపీకి చావోరేవో అన్నట్లుగా మారాయి. 2021 ఎన్నికల్లో ఇదే ప్రాంతాల్లోని 123 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకోగా, బీజేపీ 18 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈసారి పరిస్థితులు హోరాహోరీగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించి పట్టు నిలుపుకుంటారా లేక బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చూడటమే లక్ష్యంగా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత, అందరి చూపు మే 4వ తేదీ వైపు మళ్లింది. బెంగాల్‌తో పాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరి ,తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజున వెలువడనున్నాయి. ఈ విడతలో మమతా బెనర్జీ,సువేందు అధికారి వంటి దిగ్గజాల భవితవ్యం తేలనుండటంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మే 4న వచ్చే ఫలితాలు ఈ ఐదు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Advertisment
తాజా కథనాలు