ప్రధాని మోదీకి ఇజ్రాయిల్‌ నెస్సెట్ అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే మొదటి వ్యక్తి

భారత ప్రధాని మోదీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) అత్యున్నత పురస్కారమైన 'స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్'ను ఆయనకు ప్రదానం చేసింది.

New Update
India-Israel ties

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అంతర్జాతీయ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చూపిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా, ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) అత్యున్నత పురస్కారమైన 'స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్'ను ఆయనకు ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు.

బుధవారం (ఫిబ్రవరి 25, 2026) ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే, నెస్సెట్ స్పీకర్ అమీర్ ఓహానా ఈ ప్రతిష్టాత్మక పతకాన్ని ప్రధానికి బహుకరించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులందరూ నిలబడి చప్పట్లతో మోదీకి ఘనస్వాగతం పలికారు. ఈ పతకాన్ని స్వీకరించిన తర్వాత మోదీ స్పందిస్తూ.. "ఈ గౌరవం నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, 140 కోట్ల మంది భారతీయులకు, భారత్-ఇజ్రాయెల్ మధ్య ఉన్న చెక్కుచెదరని స్నేహానికి దక్కిన గౌరవం" అని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా (2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా) రెండు దేశాల నుండి అత్యున్నత పురస్కారాలను అందుకున్న అతికొద్ది మంది ప్రపంచ నాయకులలో మోదీ ఒకరిగా నిలిచారు. గత పదేళ్లలో భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు రక్షణ, వ్యవసాయం, సాంకేతికత, అంతరిక్ష రంగాల్లో ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2017లో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన మొదటి భారత ప్రధానిగా నిలిచినప్పటి నుండి ఈ బంధం 'వ్యూహాత్మక భాగస్వామ్యం'గా రూపాంతరం చెందింది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు వేగవంతమయ్యాయి. భారత దేశంలో యూదులు వేల ఏళ్లుగా ఎటువంటి వివక్ష లేకుండా జీవించడాన్ని ప్రధాని తన ప్రసంగంలో గుర్తుచేశారు.

ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసలు
ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు మోదీని తన "సోదరుడు" గా అభివర్ణించారు. "మోదీ కేవలం భారత్‌కే కాదు, ప్రపంచ స్థాయి గొప్ప నాయకుడు. ఇరు దేశాల మధ్య సహకారం ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది" అని ఆయన కొనియాడారు.

Advertisment
తాజా కథనాలు