/rtv/media/media_files/2026/05/09/tvk-vijay-2026-05-09-07-09-07.jpg)
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.తమిళగ వెట్రి కజగం TVK పార్టీ చీఫ్ విజయ్ పూర్తి మెజార్టీతో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుంది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. విజయ్‌ను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించేలా తమిళనాడు గవర్నర్‌ను ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తాను TVK పార్టీ సభ్యురాలినని పేర్కొంటూ అడ్వకేట్ ఎలిలరసి పి. ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విజయ్‌ను వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని ఆమె కోర్టును కోరారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 32లను ఉల్లంఘించడమేనని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయ పార్టీల బలాన్ని నిరూపించాల్సింది కేవలం అసెంబ్లీ లోనే గానీ, గవర్నర్‌కు ఇచ్చే లేఖలు లేదా అఫిడవిట్లలో కాదు. 1994 నుండి సుప్రీం కోర్టు ఇచ్చిన ఎన్నో తీర్పులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆమె తన పిటిషన్ లో వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిన ప్రాధాన్యత క్రమాన్ని గతంలో సుప్రీం కోర్టు తీర్పులు (ఎస్.ఆర్. బొమ్మై కేసు వంటివి), సర్కారియా కమిషన్ నివేదికలు స్పష్టంగా చెప్పాయన్నారు. ప్రస్తుతం ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాలేదు కాబట్టి, కాంగ్రెస్ మద్దతు ఉన్న అతిపెద్ద సింగిల్ పార్టీ 'టీవీకే' అధినేత విజయ్‌కే గవర్నర్ మొదటి అవకాశం ఇవ్వాలి. ముందే పూర్తి మెజారిటీ నిరూపించాలని గవర్నర్ పట్టుబట్టకూడదన్నారు.
BREAKING:
— Bar and Bench (@barandbench) May 8, 2026
A plea has been filed in the Supreme Court seeking a direction to the Tamil Nadu Governor to invite TVK leader C Joseph Vijay to form the government in the State.
The plea says TVK emerged as the single largest party in the 2026 Assembly elections. pic.twitter.com/pECLPolnUc
ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. చట్టప్రకారం అతిపెద్ద పార్టీ నాయకుడిని పిలిచి అసెంబ్లీలో బలం నిరూపించుకోమని చెప్పాల్సిన గవర్నర్.. దానికి విరుద్ధంగా ఎన్నికల తర్వాతి ఇతర కూటములను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా కనిపిస్తోందని, ఇది సుప్రీం కోర్టు గత తీర్పులకు వ్యతిరేకమని, ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు అని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.
మెజారిటీ మార్క్ 118 సీట్లు
కాగా మే 4వ తేదీన విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని TVK అత్యధికంగా 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర ప్రధాన పార్టీలలో డీఎమ్‌కే 59, ఏఐఏడీఎమ్‌కే 47, కాంగ్రెస్ 5 సీట్లు సాధించాయి. కాంగ్రెస్ (5 సీట్లు) మద్దతుతో విజయ్ కూటమి బలం 113 స్థానాలకు చేరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ మార్క్ (118 సీట్లు) కంటే ఇది 5 సీట్లు తక్కువ. ఈ క్రమంలో విజయ్ మే 7న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేశారు. కానీ, అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ మద్దతును ఇంకా నిరూపించుకోలేదంటూ విజయ్‌కు గవర్నర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు గవర్నర్ ఎవరినీ ప్రభుత్వం ఏర్పాటుకు పిలవలేదు.
Follow Us