/rtv/media/media_files/2025/11/28/maoists-2025-11-28-18-18-21.jpg)
Maoists
Maoist movement : దేశంలో మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? మావోయిస్టు ఉద్యమం తుదిదశకు చేరుకుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఆఫరేషన్ కగార్ మావోయిస్టు ఉద్యమాన్ని చావుదెబ్బతీసింది. కేంద్రం ప్రకటించినట్లు ఈ నెల 31తో ఆఫరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. ఆ తేదీతో మావోయిస్టుల ఏరివేత పూర్తవుతుందని ప్రకటించిన నేపథ్యంలో అసలు ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు. ఉంటే ఎక్కడ ఉన్నారు.. అసలు మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నాడు. అనే చర్చ మొదలైంది. ఇంకా ఎవరైనా మావోయిస్టులు మిగిలి ఉంటే వారి పరిస్థితి ఏంటీ అనేది ఇపుడు అందరినీ ఆలోజింప చేస్తున్న అంశం. ఈ క్రమంలో కేంద్రం ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది.
అయితే మావోయిస్టు పార్టీ కీలక నేతల్లో పలువురు ఎన్‌కౌంటర్లలో మరణించగా మిగిలిన నేతలంతా లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రా అలియాస్ సునీల్ ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారని కేంద్ర బలగాలు అంటున్నాయి. ఆయనతో పాటు రాష్ట్ర కమిటీ నేత ఆసిం మండల్, మరో 60మంది మావోయిస్టులున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆఫరేషన్ కగార్ ముగింపుకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో మిగిలిన మావోయిస్టులే లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్‌కు దిగుతున్నాయి. జార్కండ్‌లోని సరందా అటవీ ప్రాంతంలో వీరంతా ఉన్నారన్న సమచారంతో 15వేల మంది సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లను ఆ ప్రాంతంలో మొహరించారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న సాయుధ దళాలు సరందా అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి.
వీరి జాడ కోసం సరందా అటవీప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల్లో, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఫోటోలతో పెద్ద ఎత్తున పోస్టర్లను అతికించి వారి ఆచూకీ కోసం వేట ప్రారంభించాయి. ఈ దశలోనే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్దెఎత్తున మందుపాతరలు అమర్చి ఉండటంతో ఐఈడీ మందుపాతరలను నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాలు ముందుకు కదులుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మావోల జాడ కోసం గాలింపులో భాగంగా అధునాతన డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. సరందాలో ఉన్న మావోయిస్టుల వద్ద ఏకే 47, ఇన్సాస్ రైఫిళ్లు, గ్రనేడ్ లాంఛర్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు కేంద్ర బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సాయుధ దళాలు చాలా జాగ్రత్తగా కదులుతున్నాయి.. సుమారు 800చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరందా అడవి ప్రాంతం చుట్టూ ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు ఉండటంతో 3రాష్ట్రాలకు చెందిన బలగాలను తుది ఆపరేషన్‌లో వినియోగిస్తున్నారు.
గణపతి ఎక్కడున్నారు?
ఇది ఇలా ఉండగా మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆ పార్టీ కీలక నేత గణపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ సర్వత్రా సాగుతోంది. లొంగిపోయిన పలువులు మావోయిస్టులకు సైతం ఆయన ఎక్కడున్నారనే విషయం తెలియదని స్పష్టమవుతోంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉన్నారని, నేపాల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రచారం సాగింది. అయితే ఆఫరేషన్ కగార్ తో పార్టీ నేతల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతినడంతో ఆయన ఆచూకీ తెలియరాలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంతో పాటు లొంగిపోయిన మావోయిస్టు నేతలు, కొంతమంది మధ్యవర్తుల సూచనతో గణపతి లొంగుబాటు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఏ క్షణమైనా గణపతి అలియాస్ ముప్పాల కేశవరావు లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గణపతి లొంగుబాటుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈనెల 30న 193 నిబంధన క్రింద పార్లమెంట్‌లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టించాలని షా నిర్ణయించడంతో గణపతి లొంగుబాటు ఖాయమని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నిబంధన కింద అత్యవసర ప్రజాప్రాధాన్యత గల అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ ఏక్‌నాథ్ షిండేతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టించాలని నిర్ణయించారు. తద్వారా స్వల్ప వ్యవధి చర్చ నిర్వహించనున్నారు. ఈ తీర్మానంపై చర్చ తర్వాత దేశంలో నక్సలిజాన్ని అంతం చేసినట్లు అమిత్ షా ప్రకటించే అవకాశం ఉంది. గణపతి, ఆయన భార్య రత్నాభాయి, వార్తా శేఖర్, కమాండర్ రేల లొంగిపోతే తెలంగాణకు చెందిన మావోయిస్టుల లొంగుబాటు పూర్తయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ముగిసిన మావోయిస్టు ప్రస్థానం
సుమారు నాలుగు దశాబ్ధాలకు పైగా చరిత్ర గల మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసినట్లే. వరుసగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఉద్యమ ప్రస్థానం చివరి అంకానికి చేరుకుంది. 2025 మే లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ప్రభాకర్ రావు, పర్కాల్ వీర్, పడకల్ స్వామి, చందన్ రావు, మడ్వి హిడ్మా ఇలా అగ్రనేతలంతాఎన్‌కౌంటర్‌లలో హతమయ్యారు. మల్లోజుల వేణుగోపాల్ రావు, దేవ్ జీ, మల్లా రాజ్‌రెడ్డితో పాటు దాదాపు 4వేల మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో దేశంలో నక్సలిజం పూర్తిగా అంతరించినట్లయింది. మిగిలిన గణపతి కూడా లొంగిపోతే మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసినట్లేనని లాంఛనంగా అమిత్ షా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
Follow Us