/rtv/media/media_files/2026/06/07/odisha-2026-06-07-14-30-57.jpg)
ఒడిశా రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. కంధమాల్ జిల్లా బలిగూడ ఐటీడీఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైకుంఠ నాథ్ బెహెరాను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ను విచారణ నిమిత్తం భువనేశ్వర్‌లోని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
బెహెరా 1999 ఆగస్టు 16న నబరంగ్‌పూర్ జిల్లాలో జూనియర్ ఇంజనీర్ (సివిల్)గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ఆయన మొదటి జీతం నెలకు కేవలం రూ. 6,000. ఆయన ప్రస్తుతం నెలకు సుమారు రూ. 80,000 జీతం తీసుకుంటున్నారు.
ఈ ఇంజనీర్‌కు సంబంధించిన వివిధ ప్రాంతాల్లోని ఆస్తులపై విజిలెన్స్ అధికారులు ముమ్మర సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయన సంపాదనకు, ఉన్న ఆస్తులకు ఎక్కడా పొంతన లేకపోవడంతో అధికారులు అక్రమాస్తులను గుర్తించారు. విచారణ సమయంలో తన వద్ద దొరికిన ఈ భారీ ఆస్తులకు సంబంధించి వైకుంఠ నాథ్ బెహెరా అధికారులకు ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం గానీ, సరైన ఆధారాలు గానీ చూపించలేకపోయారు. దీంతో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
విజిలెన్స్ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. బెహెరా పేరిట ఏకంగా ఐదు బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు తేలింది. వీటి మొత్తం బిల్ట్-అప్ ఏరియా 20,000 చదరపు అడుగుల కంటే పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఐదింటిలో నాలుగు భవనాలు భువనేశ్వర్ నగరంలోని అత్యంత విలాసవంతమైన, రాజభవనాల్లాంటి ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.
14 ప్లాట్లు ఉన్నట్లు సోదాల్లో
భవనాలతో పాటు ఆయన పేరిట అత్యంత విలువైన 14 ప్లాట్లు ఉన్నట్లు సోదాల్లో వెల్లడైంది. అంతేకాకుండా, రూ. 2.04 కోట్లకు పైగా నగదు, దాదాపు 500 గ్రాముల బంగారం, వివిధ బ్యాంకుల్లో రూ. 45 లక్షల విలువైన డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బెహెరా భార్య పేరిట ఉన్న మరో బ్యాంక్ లాకర్‌ను ఇంకా తెరవాల్సి ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఒక ఐటీడీఏ ఇంజనీర్ బ్యాంక్ లాకర్లలోనే రూ. 2 కోట్ల నగదు, 300 గ్రాములకు పైగా బంగారం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఈ అక్రమాస్తుల గుర్తింపునకు సంబంధించి వైకుంఠ నాథ్ బెహెరాపై అవినీతి నిరోధక చట్టం, 2018 నిబంధనల ప్రకారం విజిలెన్స్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కేస్ నంబర్ 4/2026 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడైన అధికారికి ఉన్న మరిన్ని ఆస్తులు, ఆర్థిక లావాదేవీల రికార్డులను విజిలెన్స్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Follow Us