Single women : దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు... తెలుగు రాష్ట్రాల స్థానం ఎంతో తెలుసా?

దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 8.0 శాతం, తెలంగాణలో 7.6 శాతం మంది మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

New Update
FotoJet - 2026-06-13T093402.655

Single women

Single women : దేశవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.  కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-2024’ ఆధారంగా, దేశంలో మారుతున్న సామాజిక ముఖచిత్రాన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న ఒంటరి మహిళల సంఖ్యను అంచనా వేసింది.భర్త తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల జాతీయ సగటు 5.4 శాతంగా నమోదవ్వగా, సామాజిక చైతన్యం ఎక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఈ సగటును దాటి చాలా ముందుకు వెళ్ళిపోయాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికంటే అత్యధికంగా తమిళనాడు 11.6 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, కేరళ 10.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 8.0 శాతం, తెలంగాణలో 7.6 శాతం మంది మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. దీనికి పూర్తి భిన్నంగా ఉత్తరాది రాష్ట్రమైన బిహార్‌లో ఈ సంఖ్య కేవలం 2 శాతంగా మాత్రమే నమోదు కావడం గమనార్హం.

ఈ నివేదికలో అత్యంత విస్మయానికి గురిచేసే అంశం ఏమిటంటే, దేశంలో ఒంటరిగా ఉంటున్న పురుషుల కంటే మహిళల సంఖ్య దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉండడం. భారతదేశంలో ఒంటరి పురుషుల శాతం కేవలం 1.6 శాతం మాత్రమే కాగా, మహిళల సంఖ్య వారి కంటే భారీగా పెరిగి పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. విడాకులు, జీవిత భాగస్వామిని కోల్పోవడం (వితంతువులు) వంటి కారణాల వల్ల పురుషులతో పోలిస్తే మహిళలే అత్యధిక సంఖ్యలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అసాధారణ వ్యత్యాసం సమాజంలో వస్తున్న వేగవంతమైన మార్పులకు, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది.

ఈ అసాధారణ మార్పు వెనుక బలమైన జీవనశైలి, ఆరోగ్య కారణాలు ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య రక్షణ మెరుగ్గా ఉండడం వల్ల మహిళల సగటు జీవితకాలం (Life Expectancy) పురుషుల కంటే ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల వృద్ధాప్యంలో వారు తమ భర్తల కంటే ఎక్కువ కాలం జీవిస్తూ వితంతువులుగా మిగిలిపోతున్నారు. దీనికి తోడు, పురుషుల మరణాల రేటు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. తెలంగాణలో ప్రతి వెయ్యి మంది జనాభాకు పురుషుల మరణాల రేటు 4.6 గా, కర్నాటకలో 4.5 గా ఉంది, ఇది జాతీయ సగటు అయిన 3.6 కంటే చాలా ఎక్కువ కావడం ఒంటరి మహిళల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమైంది.

మరోవైపు పట్టణీకరణ పెరగడం, మహిళల్లో అక్షరాస్యత, ఆర్థిక స్వేచ్ఛ, విద్యాస్థాయి మెరుగవ్వడం కూడా ఈ మార్పుకు దోహదం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఐటీ, ఇతర సేవా రంగాల విస్తృతితో మహిళలు సొంతంగా సంపాదించుకునే ఆర్థిక స్థాయికి చేరారు. పాతకాలం నాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు పెరుగుతున్న తరుణంలో, కుటుంబ విభేదాలు వచ్చినప్పుడు మహిళలు రాజీ పడకుండా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించేందుకు వెనుకాడటం లేదు. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడగలిగే ధీమా ఉండడం వల్ల, వారు ఆత్మగౌరవంతో ఒంటరి జీవితాన్ని ఎంచుకుంటున్నారు.

గ్రామాల్లోనూ, నగరాల్లోనూ మహిళలు ఒంటరిగా ఉండటానికి వేర్వేరు సామాజిక కారణాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భర్తను కోల్పోయిన మహిళలు ఎక్కువగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. భర్త చనిపోయాక గ్రామీణ మహిళలు సాంప్రదాయ కారణాల వల్ల రెండో పెళ్లికి మొగ్గు చూపకపోవడం, పురుషుల కంటే మహిళల సగటు జీవితకాలం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. అదే సమయంలో, పట్టణాలు, నగరాలలో వివాహ బంధాలు తెగిపోవడం (విడాకులు) వల్ల ఒంటరిగా జీవించే మహిళల శాతం పెరుగుతోంది. ఆధునిక జీవనశైలి, ఆత్మవిశ్వాసం పట్టణ మహిళలు ఒంటరిగా ఉండేందుకు వెనుకాడకుండా చేస్తున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది.

ఈ మారుతున్న సామాజిక సమీకరణాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు, సమాజానికి పెద్ద సవాల్‌గా మారనున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 70 శాతానికి పైగా శ్రామిక శక్తి (పని చేసే ప్రజలు) ఉన్నారు. కానీ రానున్న రెండు మూడు దశాబ్దాల్లో ఈ జనాభా అంతా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతుంది. అప్పటికి తోడు లేని ఒంటరి మహిళల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కేవలం ఉపాధి కల్పనపైనే కాకుండా ఒంటరి మహిళల సామాజిక భద్రత, మానసిక ఆరోగ్యం, వృద్ధాప్య రక్షణ పెన్షన్ విధానాలపై ప్రభుత్వాలు ఇప్పుడే ఒక స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisment
తాజా కథనాలు