ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తన అఫిడవిట్‌లో కేజ్రీవాల్ తనకు ఇల్లు, కారు లేదని వెల్లడించారు. తన ఆస్తులను రూ.1.73 కోట్లుగాప్రకటించారు. ఇందులో రూ.2.96లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉన్నట్లుగా వెల్లడించారు. స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లని తెలిపారు.
కేజ్రీవాల్ అఫిడవిట్ ప్రకారం, కేజ్రీవాల్ చరాస్తులు రూ. 3.46 లక్షలు, ఇందులో బ్యాంక్ సేవింగ్స్ రూ.2.96 లక్షలు, నగదు రూ.50,000 ఉన్నాయి. ఘజియాబాద్‌లోని ఒక ఫ్లాట్‌తో కూడిన అతని స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా బీమా పాలసీలలో ఎలాంటి పెట్టుబడులు లేవని కేజ్రీవాల్ తన అఫిడవిట్ లో వెల్లడించారు. ఇంకా తనపై 14 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేజ్రీవాల్ ప్రకటించారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, కేజ్రీవాల్ తన భార్యతో కలిసి హనుమాన్ , వాల్మీకి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. న్యూఢిల్లీ నుంచి బరిలో నిలిచిన కేజ్రీవాల్ 2020 ఎన్నికల్లో తన ఆస్తుల విలువను రూ.3.4 కోట్లుగా ప్రకటించారు.
భార్యే ఎక్కువ సంపాదన
కేజ్రీవాల్ భార్య, రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అయిన సునీతా కేజ్రీవాల్ మొత్తం ఆస్తుల విలువ రూ.2.5 కోట్లుగా ప్రకటించారు. ఆమె చరాస్తులలో రూ. కోటి ఉన్నాయి, ఇందులో రూ. 25 లక్షల విలువైన 320 గ్రాముల బంగారం, రూ. 92 వేలు విలువ చేసే వెండి ఉన్నాయి. గురుగ్రామ్‌లోని ఇల్లు సహా సునీత స్థిరాస్తుల విలువ రూ.1.5 కోట్లు. ఆమె వార్షిక ఆదాయం రూ. 14.10 లక్షలు-. భర్త కంటే సునీత ఆస్తులు రెట్టింపుగా ఉన్నాయి- . మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమెకు పెన్షన్ నుండి ఆదాయం వస్తుంది.
ఫిబ్రవరి 5న ఎన్నికలు
ఢిల్లీలోని మొత్తం 70 నియోజవర్గాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు.
Also Read : KTR : నేడు ఈడీ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా!