KBCలో రూ. 50 లక్షలు.. రియల్ లైఫ్ లో కోట్ల కుంభకోణం : కటకటాల్లోకి తహశీల్దార్.

అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) షోలో పాల్గొని రూ. 50 లక్షలు గెలుచుకుని, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ తహశీల్దార్ అమితా సింగ్ తోమర్ ఇప్పుడు కటకటాల పాలయ్యారు.

New Update
arrest '

అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC) షోలో పాల్గొని రూ. 50 లక్షలు గెలుచుకుని, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ తహశీల్దార్ అమితా సింగ్ తోమర్ ఇప్పుడు కటకటాల పాలయ్యారు. దాదాపు రూ. 2.5 కోట్ల వరద సహాయక నిధుల కుంభకోణంలో ఆమెకు సంబంధం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను శివపురి జైలుకు తరలించారు.

రూ. 2.57 కోట్ల సహాయక నిధులను

ఈ వ్యవహారం 2021లో షియోపూర్ జిల్లాలోని బరోడా తహశీల్‌లో జరిగిన భారీ వరదలకు సంబంధించింది. ఆ సమయంలో బాధితులకు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన రూ. 2.57 కోట్ల సహాయక నిధులను అమితా సింగ్ తోమర్, మరికొందరు అధికారులు కలిసి పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 127 నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించి, బాధితులకు చేరాల్సిన డబ్బును ఆ ఖాతాల్లోకి మళ్లించారు. ఈ స్కామ్‌లో కేవలం తహశీల్దార్ మాత్రమే కాదు, సుమారు 22 మంది పట్వారీలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ కేసులో మొత్తం 110 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అమితా సింగ్ తోమర్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, నేరం తీవ్రతను బట్టి రెండు కోర్టులూ ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో ఆమె విధులకు కూడా హాజరుకాకుండా కనిపించకుండా పోయారు. చివరకు గ్వాలియర్‌లోని ఆమె నివాసంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆమెను అరెస్ట్ చేయడానికి సరిగ్గా ఒక్క రోజు ముందే, జిల్లా కలెక్టర్ అర్పిత్ వర్మ ఆమెను విజయపూర్ తహశీల్దార్ పదవి నుంచి తొలగించారు. 2011లో (మరికొన్ని నివేదికల ప్రకారం 2019) కేబీసీలో గెలిచినప్పుడు ఒక సామాన్య అధికారిణిగా ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఇప్పుడు వరద బాధితుల సొమ్మును కాజేసిన ఆరోపణలు ఎదుర్కోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు