/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-07-17-11.jpg)
Assembly Elections Results 2026
Assembly Elections Results 2026: దేశ రాజకీయ యవనికపై అత్యంత ఆసక్తి రేకెత్తించిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం (పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి) ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ధాటిగా సాగించిన ప్రచారం ఫలిస్తుందా? లేక విపక్షాల అస్త్రాలు పనిచేశాయా? అన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. కాగా కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా ఈసారి లెక్కింపు కేంద్రాల్లోకి కేవలం క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు.బెంగాల్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలో 165 మంది అదనపు లెక్కింపు పర్యవేక్షకులను ఈసీ నియమించింది. ఉద్రిక్తతల దృష్ట్యా బెంగాల్‌లోని లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు.
పశ్చిమ బెంగాల్.. మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ.
దేశవ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా బెంగాల్‌లో ఎన్నడూ లేని విధంగా నమోదైన పోలింగ్ శాతం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్వాతంత్య్ర భారత చరిత్రలోనే రికార్డు ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 92.47 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక రికార్డు.మొదటి విడత (152 స్థానాలు): 93.19% రెండవ విడత (142 స్థానాలు): 92.7% ఓటింగ్ నమోదైంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉండగా, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపాయి. ఫలితాల తర్వాత హింస చెలరేగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఏకంగా 2.5 లక్షల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం మోహరించింది.
అసోం.. హ్యాట్రిక్ కోసం ఎన్డీయే.. పుంజుకోవాలని యూపీఏ!
అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో 85.96 శాతం పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది. ఇక్కడ NDA కూటమిగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో బీజేపీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బరిలో ఉన్నాయి. ASM కూటమి (విపక్షం)గా గౌరవ్ గొగొయ్ నేతృత్వంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిసి గట్టి పోటీని ఇచ్చాయి. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకం కాగా, సీఏఏ (CAA) వంటి అంశాలు ఓటర్ల తీర్పును ఎలా ప్రభావితం చేశాయన్నది ఆసక్తికరంగా మారింది.
కేరళ... ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి సరికొత్త చరిత్రకు తెరలేపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తడంతో 79.63 శాతం భారీ పోలింగ్ నమోదైంది. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఈసారి 883 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.
ప్రధాన పార్టీలన్నింటికీ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని 'హ్యాట్రిక్' విజేతగా చరిత్ర సృష్టించాలని అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కూటమి తహతహలాడుతోంది. 2016 నుండి అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఈసారి ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డింది. కేరళలో తన ఉనికిని చాటుకుంటూ, ఓటు బ్యాంకును భారీగా పెంచుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) గట్టి ప్రయత్నం చేసింది.మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. పోరు అత్యంత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. స్వల్ప ఆధిక్యంతో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.బీజేపీ అభ్యర్థి పి.సి.జార్జి తన విజయంపై రూ.కోటి పందెం కాయడం విశేషం.
తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 234 స్థానాలకు జరిగిన ఈ పోరులో గెలుపు గుర్రం ఎవరనే ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అరంగేట్రం ఈసారి ఎన్నికలను గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా మార్చేసింది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి: విజయ్ పార్టీకి ఏకంగా 98-120 సీట్లు వస్తాయని, ఆయన 'కింగ్ మేకర్' కాదు ఏకంగా 'కింగ్' అయ్యే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.మెజారిటీ ఇతర సర్వే సంస్థలు మాత్రం అధికార డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. విజయ్ పార్టీ ప్రభావం కేవలం పది సీట్ల లోపే ఉంటుందని కొట్టిపారేశాయి. అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే 118 (మ్యాజిక్ ఫిగర్) స్థానాలు సాధించాల్సి ఉంటుంది.సర్వేలు కొన్ని చోట్ల హంగ్ ఏర్పడవచ్చని సూచిస్తుండటంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి:డీఎంకే కూటమి 92-100 సీట్ల మధ్య ఆగిపోవచ్చనే అంచనాలతో తమ అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడింది.ఏఐఏడీఎంకే 22-32 సీట్లకే పరిమితం కావచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, హంగ్ ఏర్పడితే తమ మద్దతు కీలకం అవుతుందని భావిస్తోంది.
పుదుచ్చేరి విజేత ఎవరు?
పుదుచ్చేరి రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈసారి సరికొత్త రికార్డులను తిరగరాశాయి. 30 స్థానాలకు జరిగిన ఈ పోరులో ఓటర్లు ఎన్నడూ లేని విధంగా చైతన్యాన్ని ప్రదర్శించారు.చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో 89.87% ఓటింగ్ నమోదైంది.ఈసారి ఎన్నికల బరిలో మూడు ప్రధాన కూటములు తలపడ్డాయి. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలో ఎన్డీయే (AINRC + BJP) కూటమి పోటీలో ఉంది. వీరికి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వీరికి 16-20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి (కాంగ్రెస్ + డీఎంకే) తో పాటు నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ కూడా ప్రధానంగా పోటీలో ఉంది.విజయ్ ఇక్కడ 'కింగ్ మేకర్'గా మారే అవకాశం ఉంది.
ఐదు రాష్ట్రాలతో పాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా సోమవారమే వెలువడనున్నాయి.మొత్తానికి, దేశవ్యాప్త రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే ఈ ఫలితాల కోసం యావత్ భారత్ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
Follow Us