/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-08-04-18.jpg)
Massive explosions at two places in Punjab
Jalandhar Scooter Blast : పంజాబ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి జరిగిన వరుస పేలుళ్ల ఘటనలు సరిహద్దు రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్తతను పెంచాయి. జలంధర్,అమృత్‌సర్ వంటి కీలక నగరాల్లో కొద్ది గంటల వ్యవధిలోనే పేలుళ్లు సంభవించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తొలుత ఇవి సాధారణ ప్రమాదాలుగా భావించి నప్పటికీ, ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడటంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది.
CCTV footage shows Activa scooty blast in Jalandhar last night #Blast#Jalandhar#Cctvpic.twitter.com/GQbyk1oVMo
— Amit Pandey (@amitpandaynews) May 6, 2026
మొదటి ఘటన జలంధర్‌లోని అత్యంత రద్దీగా ఉండే బీఎస్‌ఎఫ్ (BSF) చౌక్ సమీపంలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సుమారు 8:15 గంటల సమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక స్కూటర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో స్కూటర్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే, దేశ సరిహద్దులను కాపాడే బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయం వెలుపలే ఈ ఘటన జరగడం భద్రతా వర్గాలను కలవరపరిచింది.
జలంధర్ ఘటన మరువక ముందే, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోని ఖాసాలో మరో పేలుడు సంభవించింది. ఇది సైనిక శిబిరానికి (Army Camp) అత్యంత సమీపంలో జరగడం గమనార్హం. ఈ పేలుడు తీవ్రతకు కిలోమీటరు దూరం వరకు శబ్దం వినిపించిందని, సమీపంలోని భవనాల గోడలు కూడా కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వరుసగా రెండు కీలక రక్షణ కేంద్రాల సమీపంలోనే ఈ పేలుళ్లు జరగడం వెనుక లోతైన కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ పేలుళ్లపై లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే ఆధారాలు లభించాయి. జలంధర్ స్కూటర్ పేలుడు కేవలం యాంత్రిక లోపం వల్ల జరిగింది కాదని, దానిపై గ్రెనేడ్ దాడి జరిగినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్ల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దు అవతలి నుంచి ఉగ్రవాద సంస్థలు పంజాబ్‌లోని స్థానిక గ్యాంగ్‌స్టర్లతో చేతులు కలిపి, వారిని పావులుగా వాడుకుంటూ ఈ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా సంస్థలు ప్రాథమికంగా నిర్ధారించాయి.
ప్రస్తుతం ఘటనా స్థలాలను ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పేలుడుకు వాడిన పదార్థాలు, ఆ స్కూటర్ ఎవరి పేరు మీద ఉంది, అక్కడి సీసీటీవీ ఫుటేజీలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ రెండు పేలుళ్ల మధ్య ఏవైనా ఉమ్మడి లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఎన్ఐఏ (NIA) అధికారులు కూడా రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరిస్తున్నారు. పంజాబ్‌లో అశాంతిని సృష్టించేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఏవైనా పేలుడు పదార్థాలు సరఫరా అయ్యాయా అనే అంశంపై బీఎస్‌ఎఫ్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రభుత్వం కోరింది.
Follow Us