Marriage Scam : పెళ్లి పేరుతో సరికొత్త స్కామ్ :  పెళ్లికొడుకులు రెడీ..  పెళ్లికూతుళ్లు బురిడి!

కాసేపట్లో పెళ్లి ..  కొత్త బట్టలు వేసుకుని, బంధుమిత్రులతో కలిసి ఎంతో సంబరంగా కల్యాణ మండపానికి చేరుకున్నారు ఆ 42 మంది పెళ్లికొడుకులు. తీరా అక్కడికి వెళ్లాక వారికి ఊహించని షాక్ తగిలింది.

New Update
Marriage scam

కాసేపట్లో పెళ్లి ..  కొత్త బట్టలు వేసుకుని, బంధుమిత్రులతో కలిసి ఎంతో సంబరంగా కల్యాణ మండపానికి చేరుకున్నారు ఆ 42 మంది పెళ్లికొడుకులు. తీరా అక్కడికి వెళ్లాక వారికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన పెళ్లికూతుళ్లు ఒక్కరు కూడా రాలేదు. పైగా, పెళ్లిళ్లు చేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఫోన్లు స్విచ్చాఫ్ చేసి బోర్డు తిప్పేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో సామూహిక వివాహాల పేరుతో జరిగిన ఒక వింత మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్‌లోని విదిశ, షాజాపూర్, భోపాల్, దేవాస్ జిల్లాలకు చెందిన 42 మంది అవివాహిత యువకులకు కొన్ని రోజుల క్రితం పెళ్లి సంబంధాల బ్రోకర్లు తారసపడ్డారు. పొరుగునే ఉన్న ఇండోర్‌లోని ఒక అనాథ శరణాలయంలో ఉన్న అమ్మాయిలను వీరికి ఇచ్చి సామూహిక వివాహ వేదికపై పెళ్లి చేస్తామని నమ్మించారు. ఇందుకోసం పెళ్లికొడుకుల మొబైల్ ఫోన్లకు చక్కటి అమ్మాయిల ఫోటోలను కూడా వాట్సాప్‌లో పంపించారు. ఆ ఫోటోలు చూసి మురిసిపోయిన యువకులు, వారి కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫీజు, పెళ్లి ఖర్చుల పేరిట ఒక్కో పెళ్లికొడుకు నుండి రూ. 15,000 ల నుండి రూ. 25,000 ల వరకు నిర్వాహకులు వసూలు చేశారు.

తీరా దేవాస్ జిల్లాలోని క్లబ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వివాహ వేదికకు బంధుమిత్రులతో సహా పెళ్లికొడుకులు తరలివచ్చారు. కానీ ఎంత సమయం గడిచినా వధువులు మాత్రం రాలేదు. అనుమానం వచ్చి ఆరా తీయగా.. మొబైల్ ఫోన్లలో చూపించిన అమ్మాయిల ఫోటోలన్నీ ఇంటర్నెట్  నుండి డౌన్‌లోడ్ చేసిన మోడల్స్ ఫోటోలని తెలిసి ఆ 42 మంది వరులు నెత్తీ నోరూ బాదుకున్నారు. తాము ఘోరంగా మోసపోయామని గ్రహించిన బాధితులు.. అక్కడే డబ్బులు వసూలు చేస్తున్న ముఖేష్ బైరాగి, సునీతా బైరాగి అనే దంపతులను పట్టుకుని నిలదీశారు.

ఈ మోసానికి ఇండోర్‌లో ఉన్న తన అన్న దినేష్ దాస్ బైరాగి, మామ నరసింగ్ దాస్ బైరాగిలు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారని, వివిధ జిల్లాల నుండి పెళ్లికాని యువకులను ట్రాప్ చేసి తమ వద్దకు పంపించారని ముఖేష్ ఒప్పుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మోసం కేసు నమోదు చేసి ముఖేష్, అతని భార్య సునీతలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. పెళ్లి పేరుతో జరిగిన ఈ భారీ వంచనతో బాధితులంతా తీవ్ర అవమానంతో, ఆవేదనతో వెనుదిరిగారు. 

Advertisment
తాజా కథనాలు