West Bengal History : ఒక్కసారి ఓడితే పార్టీ ఖతమే.. దీదీకి దడ పుట్టిస్తున్న బెంగాల్ హిస్టరీ!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక విలక్షణమైన శైలి ఉంది.  బెంగాల్ చరిత్రను గమనిస్తే, ఒక పార్టీ అధికారం చేపడితే దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.

New Update
CM Mamata Banerjee calls Amit Shah 'acting PM'

CM Mamata Banerjee calls Amit Shah 'acting PM'

పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక విలక్షణమైన శైలి ఉంది.  బెంగాల్ చరిత్రను గమనిస్తే, ఒక పార్టీ అధికారం చేపడితే దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. కానీ, ఒక్కసారి ప్రజలు మార్పు కోరుకుని ఆ పార్టీని గద్దె దించితే, మళ్ళీ కోలుకోవడం ఆ పార్టీలకు ఇంచుమించు అసాధ్యంగా మారుతోంది. నేడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో, తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ యుగం (1947 - 1977):

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ బెంగాల్‌ను పాలించింది. బిధాన్ చంద్ర రాయ్ వంటి దిగ్గజాలు రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. కానీ, 1977లో కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అక్కడ కోలుకోలేకపోయింది. ఈరోజు బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉండిపోయింది.

కమ్యూనిస్టుల కోట (1977 - 2011):

జ్యోతిబసు నేతృత్వంలోని వామపక్ష కూటమి  బెంగాల్‌లో ఒక అజేయమైన శక్తిగా అవతరించింది. వరుసగా ఏడు పర్యాయాలు (34 ఏళ్లు) రాష్ట్రాన్ని పాలించి ప్రపంచ రికార్డు సృష్టించింది. 2011లో మమతా బెనర్జీ పరివర్తన్ నినాదంతో కమ్యూనిస్టుల కోటను బద్ధలు కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది మంది కార్యకర్తలతో బలంగా ఉన్న సీపీఎం, ఒక్కసారి అధికారం కోల్పోయాక ప్రస్తుతం బెంగాల్‌లో ఉనికి కోసమే పోరాడుతోంది.

తృణమూల్ హవా (2011 - 2026):

సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాలతో కమ్యూనిస్టులను గద్దె దించిన మమతా బెనర్జీ వరుసగా మూడు పర్యాయాలు (15 ఏళ్లు) రాష్ట్రాన్ని ఏలారు. అయితే, నేటి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో దీదీ సామ్రాజ్యానికి బీటలు వారినట్లు కనిపిస్తోంది.

చరిత్రను బట్టి చూస్తే, ఒకసారి అధికారం కోల్పోయిన పార్టీకి బెంగాల్ ప్రజలు మళ్ళీ అవకాశం ఇవ్వడం లేదు. కాంగ్రెస్, సీపీఎంలు నేడు మూడో, నాలుగో స్థానాలకే పరిమితం కావడమే దీనికి ఉదాహరణ. బెంగాల్ రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఇక్కడ ఓటమనేది కేవలం సీట్లు కోల్పోవడం మాత్రమే కాదు, కేడర్ మొత్తం విచ్ఛిన్నం కావడం.  మమతా బెనర్జీ ఒక పోరాట యోధురాలు. కానీ, పార్టీ మొత్తం ఆమె ఇమేజ్ మీదనే ఆధారపడి ఉండటం, ద్వితీయ శ్రేణి నాయకత్వం లోపించడం వల్ల.. అధికారం పోతే పార్టీని కాపాడుకోవడం ఆమెకు పెద్ద సవాల్ కానుంది.

Advertisment
తాజా కథనాలు